కళా సౌరభం..సురభి నాటకం | - | Sakshi
Sakshi News home page

కళా సౌరభం..సురభి నాటకం

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

పద్మశ్రీ పురస్కారం

చక్రాయపేట: నలభై ఏళ్ల సుదీర్ఘ విరామానంతరం సురభి కళామండలి సొంత గడ్డపై అడుగిడబోతోంది. ప్రజలకు తమ నాటక నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వస్తోంది. 141వ వార్షికోత్సవం సందర్భంగా ఐదు రోజుల విభిన్న నాటక ప్రదర్శనలు ఇచ్చేందుకు మరో పదిహేను రోజుల్లో కళాకారుల బృందం రానుంది.అందుకు తగ్గ ఏర్పాట్లను చేపట్టేందుకు సురభి నాటక కళాకారుల వంశీకుడు భాను ప్రసాద్‌,సురభి యువకళా సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌, స్థానిక అధికారులు,స్థానిక నేతలను కలిశారు.

140 ఏళ్ల చరిత్ర

ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు అత్యంత ప్రీతి కరమైన తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తూ.. గ్రామాల్లో తిరుగుతూ సురభి గ్రామానికి కళాకారుల బృందం చేరుకుంది. ఆ పరిసర గ్రామాల్లో నాటక ప్రదర్శనలు ఇస్తూ సాయంత్రం వేళకు అల్లపు రెడ్డి వంశీకులకు చెందిన మామిడి తోటకు చేరుకునేది.ఆమామిడి తోట యజమాని అల్లపురెడ్డి చెన్నారెడ్డి వారి కళలను గుర్తించాడు. స్వతహాగా ఆయనకూ కళల పట్ల అభిమానం ఉండటంతో కళాకారులకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించాడు.కళాకారుల మూల పురుషుడు వనారస గోవిందరావు ఆలోచనలకు అల్లపురెడ్డి చెన్నారెడ్డి సహాయ సహకారాలు తోడు కావడంతో తోలుబొమ్మలాట నుంచి 1885లో నాటక రంగంగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతుంటారు.క్రమేణా నాటక రంగం సినిమా సెట్టింగులను తలదన్నేలా మరో సారి రూపురేఖలను మార్చుకొని కళాకారులు సాంకేతిక నైపుణ్యంతో తమ నాటకాలను జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటించి దేశ విదేశాలకు విస్తరించి ప్రజల మన్ననలను పొందారు.సురభి వంశీకుల సహాయ సహకారాలతో తమ నాటక రంగం విస్తరించినందుకు కృతజ్ఞతగా ఎక్కడైతే తమ కళలకు బీజం పడిందో అదే గ్రామ పేరైన ‘సురభి’పేరును తమ కళామండలికి పెట్టు కోవడంతో సురభి నాటక కళామండలిగా రూపాంతరం చెందింది. కళామండలిగా మారిన తర్వాత 1984లో సురభి గ్రామం నాగలగుట్టపల్లెలోని జిల్లా పరిషషత్‌ ఉన్నత పాఠశాలలో అప్పటి జిల్లా కలెక్టర్‌ కేవీ రమణాచారి సహకారంతో నాటకాల ప్రదర్శనలు ఇచ్చింది.నాడు లవకుశ, మాయాబజారు,బాలనాగమ్మ తదితర నాటకాలను ప్రదర్శించి ప్రజలను అబ్బుర పరచింది.

నాగులగుట్టపల్లెలో..

సుమారు నలభై ఏళ్ల కిందట ఇచ్చిన ప్రదర్శనలను సొంత గడ్డపై ప్రజలకు చూపించేందుకు సురభి నాటక మండలి కళాకారులు ఈనెల 21న రాబోతున్నారు.ఈనెల 27 నుంచి మే 1 వరకు ప్రదర్శనలు ఇవ్వనుంది. 27న భక్త ప్రహ్లాద, 28న పాతాళ భైరవి, 29న లవకుశ, 30న భూకై లాష్‌, మే 1న మాయాబజార్‌ నాటకాలను ప్రదర్శించనున్నారు.సురభి నాటక కళామండలిగా సుదీర్ఘంగా కొనసాగిన అనంతరం మండలి పలు శాఖలుగా విడిపోయి ఇప్పుడు భానోదయ నాటక మండలి పేరుతో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని భాను ప్రసాద్‌ తెలియ జేశారు.నలభై ఏళ్లక్రితం నాగలగుట్టపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రదర్శనలు ఇచ్చిన సురభి కళాకారులు ఇప్పుడు అదే ఊరులోని నాగచైతన్య విద్యానికేతన్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ వేదికగా ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

సురభి నాటక మండలిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన నాగేశ్వరరావు(బాబ్జి)కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అంద జేసింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను కళారత్న బిరుదుతో సత్కరించింది. కళాకారులు నాడు నివాసం ఉన్న ఇళ్లు కూలిపోయింది.తమ కళలకు నాంది పలికిన ఊరును,తమ పూర్వీకులు నివాసం ఉన్న ఈ ఇంటి గుర్తుగా ఇక్కడి మట్టిని తీసుకెళ్లి పూజలు చేస్తూ నాటక ప్రదర్శన సందర్భంలో తిలకంగా దిద్దు కునే ఆనవాయితీ నేటికీ ఈ కళాకారులు కొనసాగిస్తున్నారు.

141వ వార్షికోత్సవ వేడుకలకు

సమాయత్తం

ఈనెల 27 నుంచి నాటక ప్రదర్శనలు

ఏర్పాట్లలో సురభి యువ కళాసమితి సమాయత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement