కడప సెవెన్‌రోడ్స్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఈనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.
13న గండిలో టెండర్లు
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ, మహాకుంభాభి షేకం ఏర్పాట్లకు సంబంధించి ఈనెల 13న షీల్డ్ టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవదాయ శాఖ కర్నూలు డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ తెలిపారు.ఆరు రోజుల పాటు జరిగే ఈ వేడుకల సందర్భంగా షామియానా,బారికేడ్లు.పందిళ్ల ఏర్పాట్లు,లైటింగ్,పూలు డెకరేషన్‌లు, స్వాగత ఆర్చీల ఏర్పాటు,దేవస్థానం కుభాభి షేకానికి సారవలు ఏర్పాటు,యాగశాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వ హిస్తున్నట్లు చెప్పారు.వీటికి టెండరు షెడ్యూలు ధర వెయ్యి చొప్పున, రూ.ఐదువేల చొప్పున ధరావత్తు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.అలాగే ఏడాది పాటు దేవస్థానానికి పాలు పెరుగు,అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు సరఫరా చేసే హక్కులు కల్పించేందుకు కూడా అదే రోజున టెండర్లు నిర్వహిస్తామని చెప్పారు, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
ఎస్‌బీఐ ఏటీఎంలలో
నగదు నిల్
కడప కార్పొరేషన్: జిల్లాలో ఎక్కువ మంది ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. చాలావరకూ ఎస్‌బీఐ ఏటీఎంలు మూసేశారు. కొన్ని ఏటీఎంలలో నగదు ఉన్నా రూ.100 నోట్లు మాత్రమే ఉన్నాయి. రూ.500 నోట్లు ఉండటం లేదు. మార్చి 31 నుంచి జిల్లాలో, ముఖ్యంగా కడప నగరంలో ఈ పరిస్థితి ఉందని ఖాతాదారులు వాపోతున్నారు. రూ.100 నోట్లే ఉండటంతో రూ.4వేలకు మించి విత్‌డ్రా చేయడం వీలు కావడం లేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎస్‌బిఐ అధికారులు చర్యలు చేపట్టి నగదు కష్టాలకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.


