అవాంతరాల స్పాట్‌ | - | Sakshi
Sakshi News home page

అవాంతరాల స్పాట్‌

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

పదోతరగతి మూల్యాంకనంలో

అయ్యవార్లకు అగచాట్లు

నిత్యం నెట్‌వర్క్‌ సమస్య

మొరాయిస్తున్న ట్యాబ్స్‌లు

మూల్యాంకన కేంద్రంలో

ఉపాధ్యాయుల ధర్నా

కడప ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం ఉపాధ్యాయులకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా ట్యాబ్‌ ఆధారిత మార్కుల నమోదు ప్రక్రియ ఇక్కట్లకు గురి చేస్తోంది. స్పెషల్‌ అసిస్టెంట్లకు ఈ విధానం తలకుమించిన భారంగా మారింది. వారికి ఇచ్చిన ట్యాబులు సాంకేతిక సమస్యతోపాటు నెట్‌వర్క్‌ సరిగా అందకపోవడంతో పడరానిపాట్లు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లకు కలిసి ఒక స్పెషల్‌ అసిస్టెంట్‌ ఏర్పాటు చేస్తారు. అ స్పెషల్‌ అసిస్టెంట్‌ ట్యాబ్‌లో మార్కులు నమోదు చేస్తారు. ఇలా ప్రతి స్పెషల్‌ అసిస్టెంట్‌ రోజుకు 40 జవాబు పత్రాల చొప్పన ఇద్దరికి సంబంధించి 80 సమాధాన పత్రాలకు మార్కులను ట్యాబ్‌ల్లో అప్‌లోడు చేయాల్సి వస్తుంది. అలాగే ఒక్కో పేపర్‌ స్కానింగ్‌ చేయడానికి వారికి 15 నుంచి 20 నిమిషాలకు పైగా సమయం పడుతుందని తెలిసింది. దీనికితోడు ఎక్కువ మంది స్పెషల్‌ అసిస్టెంట్లు ఒకేసారి నెట్‌వర్క్‌ వినియోగిస్తుండటంతో ట్యాబ్‌లు సైతం మెరాయిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రతి రోజు మూల్యాంకన పక్రియ అనేది ఒక ప్రహసనంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రోజు పొద్దుపోయే వరకు..

సాధారణంగా జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 9 నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ట్యాబ్‌ ఆధారిత మార్కుల నమోదు పక్రియ సాంకేతిక సమస్యల కారణంగా రాత్రి పొద్దుపోయేవరకు జరుగుతుండటంతో నిత్యం ఆయ్యవార్లు అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతం నుంచి మూల్యాంకన విధులకు వచ్చే వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పడరానిపాట్లు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌వర్క్‌ సమస్య ఒక కారణం కాగా విద్యార్థి రాసిన జవాబుపత్రంలోని ప్రతి పేజీని స్కాన్‌ చేసి అప్‌లోడు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతోపాటు అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ దిద్దిన పత్రాలను క్షుణంగా పరిశీలించాల్సి రావడం కూడా ప్రధాన సమస్యగా తలెత్తింది. దీంతోపాటు అధికారులు మార్కుల విషయంలో ఎటువంటి తేడా వచ్చిన పూర్తి బాధ్యతను స్పెషల్‌ అసిస్టెంట్లదేనని చెప్పడంతో వారిలో తీవ్ర ఒత్తిడి నెలకొంది.

మూల్యాంకన కేంద్రంలో ట్యాబ్‌లతో ధర్నా..

కడప మున్సిపల్‌ హైస్కూల్‌ మొయిన్‌లో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రంలో ట్యాబ్‌లకు సంబంధించిన టెక్నికల్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం స్పెషల్‌ అసిసెంట్లు ట్యాబ్‌లతో ధర్నా నిర్వహించారు. మొదటి నుంచి ఈ ట్యాబ్‌లతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. సమస్యను డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధింత సమస్యను డీఈఓ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement