● పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
● పదో తరగతి విద్యార్థులకు
చక్కటి అవకాశం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 3
దరఖాస్తులకు చివరి గడువు : ఏప్రిల్ 4
పాలిసెట్ ప్రవేశ పరీక్ష : ఏప్రిల్ 25
ఫలితాలు : మే
ప్రవేశ కౌన్సెలింగ్ : జూన్‌లో
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్చి నెలలోనే పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది వైఎస్సార్‌జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి 167 కేంద్రాలలో,28152 మంది విద్యార్థులు పది పరీక్షలను రాయనున్నారు. వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతక నిపుణులు సూచిస్తున్నారు.
గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం....
గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ చదవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తాయి. అప్లికేషన్ ఫీజు ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ పోర్టు సైజు ఫొటోతో ఇంటర్ నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల వివరాలు:
పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) మెటలర్జికల్ ఇంజినీర్(ఎంఈటీ) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని కడప, పొద్దుటూరు, వేంపల్లె, సింహాద్రిపురం, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, కమాలపురంలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో దాదాపు 3800 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాల వ్యవధి మూడు సంవత్సరాలు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కడపలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్(ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్(ఈసీ), సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, డిప్లమా కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాలలో ఒక బ్రాంచ్‌కు 60 సీట్లు చొప్పున 240 సీట్లు ఉన్నాయి. దీంతోపాటు అమ్మాయలకు ప్రత్యేక హాస్టల్ వసతి కూడా ఉంది
పాలిసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడదుల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం.ఏప్రిల్ 04వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా పాలిసెట్ అప్లికేషన్ సబిట్ చేయాలి. ఏప్రిల్ 25వ తేదీ పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. మే నెలలో ఫలితాలను ప్రకటించనున్నారు. జూన్ నెలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పాలిసెట్ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.
ఎన్నో ప్రయోజనాలు...
పాలిటెక్నిక్‌లో కోర్సు పూర్తి చేస్తే ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇటీవల ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లు గడువు ఉంటుంది. ఆ తర్వాత నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్‌లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.


