పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే పెండింగ్ ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రానున్న బడ్జెట్‌లో అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటిపారుదలకు 15 శాతం నిధులు కేటాయించాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరిస్తేనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సామాజిక న్యాయం ఒనగూరుతుందని అభిప్రాయపడ్డారు. విభజన హామీలు తక్షణమే అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి అధ్యక్షతన శనివారం కడపలోని బీసీ భవన్‌లో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.
అభివృద్ధిని వికేంద్రీకరించాలి
వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలోనూ వెనకబడి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఈఎస్‌ఎస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య అన్నారు. వ్యవసాయం, దాని ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయాలన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపైనే దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు. రెండు వేల ఎకరాల్లో మంచి రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కానీ మూడు పంటలు పండే జరి భూములను సేకరించడం సరికాదన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో 62 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.రాజధాని కోసం అప్పు చేసి లక్షల కోట్లు ఖర్చుచేస్తామంటున్న ప్రభుత్వం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రూ. కోటి మంజూరు చేయడం లేదని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
సదస్సుకు అధ్యక్షత వహించిన నారాయణరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 194 మెట్ట ప్రాంత మండలాలలో 23 లక్షల ఎకరాలకు సాగునీరు, రెండున్నర కోట్ల మందికి తాగునీరు అందుతుందన్నారు. మహా నగరాల అభివృద్ధి కోసం నిధులు ఖర్చుచేస్తున్నారు తప్ప ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. కడప స్టీల్ ప్లాంటు, కడప–బెంగుళూరు రైల్వేలైన్, ఇతర విభజన హామీల అమలు కోసం పోరాడతామని తెలిపారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్దివేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షుడు వైవీ శివయ్య, అనంతపురం జిల్లా అధ్యక్షుడు జి.నారాయణరెడ్డి, కేవీ రమణ, వైఎస్సార్ సీపీ నాయకుడు బూసిపాటి కిశోర్‌కుమార్, ఏఐఎస్‌బీ జాతీయ కన్వీనర్ జయవర్దన్, పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరాయుడు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, బీఎస్పీ జిల్లా అ ధ్యక్షుడు గుర్రప్ప, పీఆర్‌ఎస్‌వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.శంకర్,కాంగ్రెస్ నాయకులు సత్తార్ పాల్గొన్నారు.
బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులు దశాబ్దాలు గడిచిపోతున్నా పూర్తి కాలేదని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించారన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపులు 9 శాతానికి తగ్గి నేడు కూటమి ప్రభుత్వ హయాంలో 3.5 శాతానికి చేరుకున్నాయన్నారు.2026–27 బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిస్తేరాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. సెయిల్ ఆధ్వర్యంలో కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని, బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని, కడప–బెంగుళూరు రైలు మార్గాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి
ప్రాంతీయ సదస్సులో వక్తలు


