కడప అర్బన్: దివంగత నేత వైఎస్సార్ ఆశయాలకు, గత ప్రభుత్వ కృషికి నిలువుటద్దంగా నిలిచిన రిమ్స్ ( GGH) ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నిరాదరణకు గురవుతోంది. కోట్లాది రూపాయలతో సూపర్ స్పె షాలిటీ సౌకర్యాలు కల్పించినా, కనీస మౌలిక సదు పాయాల నిర్వహణలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ’సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో తేటతెల్లమైంది.
చక్రాల కుర్చీ లేదు.. స్ట్రెచర్ జాడ లేదు!
ఓపి గ్రౌండ్ ఫ్లోర్‌లోని కీలక విభాగాలైన ఆర్థోపెడిక్, సర్జికల్, ఫిజియోథెరపీ విభాగాలకు వచ్చే రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అటు బయో కెమిస్ట్రీ, ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్ వంటి అత్యవసర పరీక్షల కోసం వెళ్లే అస్వస్థులైన రోగులకు వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వారి సహాయకులు చేతులపై మోస్తూ తీసుకెళ్లడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.
అపరిశుభ్రతకు నిలయాలు
సౌకర్యాల లేమి ఒకెత్తయితే, ఉన్న వాటి నిర్వహణ మరో ఎత్తు. ఐపీ విభాగంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బాత్రూంలు అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. దుర్వాసన, అపరిశుభ్రత కారణంగా రోగులు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
చెత్త కుప్పల మధ్యే చికిత్స!
ఐపీ విభాగంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడవ అంతస్తు వరకు ఎటుచూసినా అపరిశుభ్రతే రాజ్యమేలుతోంది. డస్ట్‌బిన్ల నుంచి చెత్త బయటకు వచ్చి వార్డుల్లోనే పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
సొంత క్లినిక్‌లకే ప్రాధాన్యత!
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ నిర్వహించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కొందరు వైద్యు లు వాటిని బేఖాతరు చేస్తున్నారు. విధులకు ’డుమ్మా’ కొట్టి, ఆ సమయంలో నగరంలోని తమ సొంత క్లినిక్‌లలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ కాసులు గడిస్తున్నారు.
సీఎం బంధువునంటూ పెత్తనం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిమ్స్ శానిటేషన్ కాంట్రాక్ట్ దక్కించుకున్న భాస్కర్ నాయుడు అనే వ్యక్తి, తాను ముఖ్యమంత్రికి బంధువునని చెప్పుకుంటూ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల పేరుతో శానిటేషన్ కార్మికులను తొలగించారు.
కూటమి ప్రభుత్వంలో జీజీహెచ్ (రిమ్స్)కే రోగం వచ్చింది. సమయానికి వైద్యులు రాక..వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఇక కనీస సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీసం నడవలేని రోగులకు వీల్‌ఛెయిర్‌లను సైతం ఇప్పించలేని దుస్థితి ఉంది. ఇక్కడి సౌకర్యాలపై ‘సాక్షి’బృందం చేపట్టిన ‘గ్రౌండ్ రిపోర్ట్’లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
● కడప జీజీహెచ్ (రిమ్స్)లోని అధికారులు వీల్‌ఛెయిర్‌లు, స్ట్రెక్చర్‌ల విషయం ప్రస్తావిస్తే కొరత ఉన్న విషయం వాస్తమమేననీ, మరిన్ని వీల్‌ఛెయిర్‌లు, స్ట్రెక్చర్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామనీ తెలియజేస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని వివరించారు.
ఈ ఫోటోలోని వ్యక్తి పేరు లక్ష్మీనారాయణ. తన కుమారుడు సూర్యనారా యణ మానసిక అనారోగ్యంతో తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురయ్యాడు. బద్వేలు పట్టణం ఆంజనేయ నగర్ లో నివాసముంటు వైద్య సహాయం కోసం రిమ్స్ కు వచ్చారు. ఈ సందర్భంగా తండ్రి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో పాటు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ సమస్య కూడా ఉందన్నారు. 100 శాతం వైకల్యం ఉండడంతో రిమ్స్ డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్ కోసం వచ్చానన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు వచ్చామని తమ గోడు ఎవరు వినిపించుకోవడంలేదని తెలియజేశారు.


