నేడు ఓటర్ల అవగాహన ర్యాలీ
కడప సెవెన్‌రోడ్స్: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆధ్వర్యంలో జనవరి 25న కడప కలెక్టరేట్‌లోని సభాభవనం వద్ద జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహించనున్నారు.ఉదయం 9.00 గంటలకు జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 థీమ్, లోగో ఆవిష్కరణ జరుగుతుందని జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు శనివారం ఒకప్రకటనలో తెలిపారు. అంతకుముందు కోటిరెడ్డి సర్కిల్ నుంచి కలెక్టరేట్ సభాభవనం వరకు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని డీఆర్వో తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పులివెందుల సూపర్ స్పెషాలిటీ వెట ర్నరీ హాస్పటల్‌లో పశుసంవర్ధశాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్. మిట్టపల్లె నరేంద్రరెడ్డి, వాణి(గృహిణి)ల కుమారుడు డాక్టర్. మిట్టపల్లె నితీశ్వర్‌రెడ్డి ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 108వ ర్యాంకు సాధించాడు. నితీశ్వర్‌రెడ్డి ఎంబీబీఎస్ రాయపూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో, జనరల్ మెడిషన్(ఎండీ) కర్నూల్ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగ ఆదాయం అదుర్స్ అనిపించింది.రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి విజయవాడ, బెంగుళూరు, హైదరాబాదు, చైన్నె, తిరుపతి, కర్నూలుతోపాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. పండుగకుముందు 221 బస్సులను ఆయా ప్రాంతాలకు 141110 కిలోమీటర్ల చొప్పున నడపగా, 28,219 మంది ప్రయాణించారు. వారి ద్వారా సంస్థకు రూ. 58,56,436 ఆదాయం ఒనగూరింది. అలాగే పండుగ ముగిసిన తర్వాత 259 బస్సులు 142008 కిలోమీటర్ల చొప్పున తిప్పగా 36,832 మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చారు. తద్వారా రూ. 65,12,171 ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీకి రూ. 1,23,68,707 ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులుతెలియజేశారు.
కడప అర్బన్: దేవుని కడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 25వ తేదీన రథోత్సవానికి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒక డీఎస్పీ,ఐదుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 250 మంది ఇతర పోలీసు సిబ్బంది,స్పెషల్ పార్టీలతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.
రాజంపేట: జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛరథాలను అమలుచేస్తే.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతవైపు బాధ్యతగా అడుగులు వేస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శనివారం స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా రాజంపేట నియోజకవర్గం కూచివారిపల్లె గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లాలోనే మొదటి స్వచ్ఛ రథాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రతి రోజు ప్రతి ఇంటి నుంచి పొడి, తడి వ్యర్ధాలను వేర్వేరుగా సేకరిస్తారన్నారు. వ్యర్ధాలను సేకరించినందుకు ప్రతి ఫలంగా ప్రజలకు అవసరమైన విలువ ఆధారిత నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుందన్నారు. ఒక విధంగా ఈ విధానం చెత్త నుంచి ఆదాయాన్ని గడించడమే అని అన్నారు. ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామన్నారు. రాజంపేట సబ్‌కలెక్టర్ భావన, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ పాల్గొన్నారు.
నేడు ఓటర్ల అవగాహన ర్యాలీ


