కమనీయం..కడప రాయుడి కల్యాణం
కడప సెవెన్‌రోడ్స్: తిరుమలేశుని తొలిగడపగా పేరుగాంచిన, తిరుమలరాయుని ప్రతిరూపంగా భావిస్తున్న కడపరాయుని కల్యాణోత్సవాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఘనంగా నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కప్పురపు పరిమళాల కడప రాయుని కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఆ ప్రాంగణానికి భక్తులు సమయానికి ముందే చేరుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి బయటి నుంచి కూడా కల్యాణాన్ని తిలకించాల్సి వచ్చింది.కల్యాణోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో రంగురంగుల పూలతో అందంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మోహన రూపంలో ధగధగలాడే నూతన వస్త్రాలతో వరుడిగా స్వామి కొలువుదీరగా, మరోవైపు ముగ్ధమనోహర రూపాలతో శ్రీదేవి, భూదేవిలు వధువులుగా ఒదిగి కూర్చొన్నారు. మంచి గంధం, మధుర పరిమళం, మంగళ వాయిద్యాల సుస్వరాలు భక్తులను మైమరిపిస్తుండగా భక్తులు రెండు కళ్లు చాలవన్నట్లు కల్యాణ క్రతువును తిలకించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ అధికారులు కల్యాణోత్సవాన్ని పర్యవేక్షించారు. తొలుత ఉభయదారులకు, అనంతరం భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కల్యాణం అనంతరం తలంబ్రాలలో వాడిన అక్షతల కోసం భక్తులు ఎగబడ్డారు. నిర్వాహకులు వారికి అక్షతలతోపాటు ముత్యాల తలంబ్రాలను కల్యాణ ప్రసాదంగా పంచి పెట్టారు. కల్యాణోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి పాల్గొన్నారు.
గజవాహనంపై దేవదేవుడు
రాత్రి గజ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామ స్మరణల మధ్య గ్రామోత్సవం వైభవోపేతంగా సాగింది. స్వామికి ఇష్టమైన వాహనం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకున్నారు.
వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు
కమనీయం..కడప రాయుడి కల్యాణం


