వైభవంగా ధ్వజారోహణం
చంద్రప్రభ వాహనం నుంచి భక్తులను కటాక్షిస్తున్న కడప రాయుడు
కడప సెవెన్‌రోడ్స్ : దేవతలారా రండి....కడప రాయుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించండి అంటూ గరుత్మంతుడు సకల దేవతలను ఆహ్వానించాడు. తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వేద పండితులు ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్ తదితరుల అర్చక బృందం ఆధ్వర్యంలో క్షేత్ర నాయకుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిసేలా గరుడిని చిత్రం గల పతాకాన్ని ధ్వజంపై ఎగురవేశారు.
కొడిముద్దల పంపిణీ
ధ్వజారోహణం సందర్భంగా భక్తులకు అందజేసే గరుడుని ప్రసాదాన్ని కొడిముద్దలుగా పేర్కొంటారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తప్పక ఫలం లభిస్తుందన్న విశ్వాసం ఈ ప్రాంత భక్తుల్లో ఉండడంతో మహిళలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఆ ప్రసాదం కోసం పోటీలు పడ్డారు. అనంతరం అలంకరించిన తిరుచ్చి వాహనంపై స్వామిని ఊరేగించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తిగీతాలాపనల మధ్య స్వామికి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామిని అలంకార మండపానికి చేర్చి అలంకరించిన చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. గోవిందనామ స్మరణల మధ్య స్వామి గ్రామోత్సవానికి తరలివెళ్లారు. ఆలయ ప్రాంగణంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గాయకులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. అనంతరం అదే వేదికపై హరికథ నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కోలాటం, చెక్కభజన బృందాలు ఉదయం, సాయంత్రం స్వామి ఊరేగింపు ఎదుట తమ కళను ప్రదర్శించారు.
నేడు..బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి పెద్ద శేష వాహనం సేవలు ఉంటాయి.
ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న
అర్చకులు


