సమస్యలను శ్రద్ధతో పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభా భవన్ సమావేశ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని, అధికారులు అలసత్వం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలనన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులకు అందిన అర్జీలను పరిష్కరించేందుకు సమయం కేటాయించి సమీక్ష చేయాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారి సురేష్ కుమార్, మెప్మా పీడీ కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ–ఆటోలను ప్రారంభించిన కలెక్టర్
పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జిల్లాకు కేటాయించిన ఎనిమిది చెత్త సేకరణ ట్రక్ ఈ–ఆటోలను కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య వ్యర్థాల సేకరణకు గ్రామ పంచాయతీల కోసం ఈ–ఆటోలను మంజూరు చేశామన్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాలలోని అట్లూరు, తువ్వ పల్లి, ఉప్పలూరు, కల్లూరు, తొండూరు, పెద్దచెప్పలి, కనుమోలుపల్లి, రేకలకుంట పంచాయతీలకు ఒక్కొక్క ఆటోను అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ –ఆటోలు తడి పొడి చెత్తలను వేరువేరుగా గృహాల నుంచి సేకరించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలించడానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


