నేడు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి రాక
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ఒకరోజు పర్యటన నిమిత్తం మంగళవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో కడపలో జరిగే దీని ఇస్తిమా నిర్వహణపై కలెక్టరేట్‌లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో కలిసి మంగళవారం మంత్రి సవిత సమీక్ష నిర్వహిస్తారన్నారు. దీని ఇస్తిమా సందర్భంగా ప్రార్థనల కోసం లక్షలాది మంది ముస్లింలు రానుండటంతో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయల కల్పనపై తీసుకుంటున్న చర్యల గురించి అధికారులతో కలిసి ఈ సమీక్షలో చర్చిస్తారన్నారు. అనంతరం కొప్పర్తిలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించే దీని ఇస్తిమా నిర్వహణ ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రి సవిత పరిశీలిస్తారన్నారు. అనంతరం సాయంత్రం కడప నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి సవిత రోడ్డు మార్గంలో బయలుదేరి వెళతారన్నారు.
11న రాష్ట్ర స్థాయి
పాటల పోటీలు
రాజంపేట రూరల్ : అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు 52వ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 11న రాష్ట్ర స్థాయిలో కళాంజలి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.కళాంజలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనదలచినవారు తమ పేర్లను నమోదు చేసుకొనుటకు 9490884300 నంబరులో సంప్రదించాలన్నారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.3000లు, ద్వితీయ బహుమతిగా రూ.2000లు, తృతీయ బహుమతిగా రూ.1000లు అందించనున్నట్లు తెలియజేశారు.
కడప రిమ్స్ వైద్య
అధ్యాపకుల ప్రతిభ
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్‌లో వైద్య అధ్యాపకులుగా పనిచేస్తున్న ఇద్దరికి ఉత్తమ పరిశోధక అవార్డులు వచ్చాయి. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈనెల 12న నిర్వహించిన రీసెర్చ్ డే లో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ, వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఫ్యాకల్టీగా ఉన్న డాక్టర్ బి.నాగశ్రీలత, బయో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీఎల్ ఆశాలతకు ఉత్తమ రీసెర్చ్ అవార్డులు వరించాయి. వీరిని సోమ వారం కడపలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జమున, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి అభినందించారు.
‘జేఈఈ’ పరీక్షలకు
పకడ్బందీ ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని పీజీఆర్‌ఎస్ సమావేశం మందిరంలో జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 21 నుంచి 24 వరకు, 28, 29 తేదీలలో నిర్వహించే పరీక్షల నిర్వహణలో భాగంగా వైయస్సార్ కడప జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పరీక్షలను సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.


