మందుల్లేకుండా వైద్య శిబిరాలా !
● జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన
పశు ఆరోగ్య వైద్య శిబిరాలు
● మందులు లేక
పశువైద్య శిబిరాలు వెలవెల
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పశు వైద్య శిబిరాలు తొలిరోజే తుస్సుమన్నాయి. పశు ఆరోగ్య శిబిరాలతోపాటు పశు బీమా పథక అమలుకు ప్రభుత్వం ఒకేసారి శ్రీకారం చుట్టింది. వైద్యం కోసం తమ పశువులను శిబిరాలను తీసుకొచ్చిన రైతులకు నిరాశే మిగిలింది. పశువులకు పరీక్షలు చేసిన వైద్యులు మందులివ్వకుండా పంపించారు. అంతదానికి ఇంత హడావుడి చేయాలా.. మందులు ఇవ్వకుంటే ఈ వైద్య శిబిరాలను ఎందుకు నిర్వహిస్తున్నారని పలు చోట్ల ప్రశ్నించినట్లు తెలిసింది. అసలే గత పది నెలలుగా పశు వైద్యశాలల్లో మందులు లేవు. ఇక్కడైనా ఇస్తారనుకుని వస్తే పరీక్షలు చేసి మమ అనిపించడంపై పశు పోషకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19వ తేదీ సోమవారం 65 పశు క్యాంపులను నిర్వహించారు. ఈ శిబిరంలో ఒక్క మందు బిల్ల అందించలేదని పలువురు రైతులు తెలిపారు . ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ పశు వైద్య శిబిరాలకు మందులు మంజూరు చేయాలని పశుపోషకులు, గొర్రెల, మేకల యజమానులు కోరుతున్నారు.


