శ్రీరామ శోభాయాత్రకు భారీ సన్నాహాలు
కడపలో మోటారు బైక్ ర్యాలీ
● 21న శ్రీ సీతారామ కల్యాణం
● 22న శ్రీ రామ శోభాయాత్ర
కడప సిటీ : అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న సీతారాముల కల్యాణం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసినట్లు ఐక్యవేదిక కమిటీ ప్రతినిధులు సోమవారం పేర్కొన్నారు. 2024 జనవరి, 22వ తేదీన అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిందన్నారు. అదేరోజున కడపలో మొదటి శ్రీరామ మహా శోభాయాత్రను నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఈనెల 22న జరగనున్న మహా శోభాయాత్ర మూడోదిగా తెలిపారు. లక్షలాది మంది తరలిచ్చే ఈ శోభాయాత్ర నిర్వహించే ప్రాంతమంతా తోరణాలతో అలంకరించామన్నారు. కులమతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా అందరూ ఈ యాత్రకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాలు ఇలా...
ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు కడప మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల విందుగా కమనీయ రమణీయ శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుందన్నారు. అలాగే 22వ తేదీన గురువారం ఉదయం 7.00 గంటల నుంచి చిన్నచౌకులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీ రామ మహా శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర అప్సర సర్కిల్, వై.జంక్షన్, ఆర్టీసీ బస్టాండు, ఎస్పీ బంగ్లా, రాజారెడ్డివీధి, నెహ్రూ పార్కు, అన్నమయ్య సర్కిల్, కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, మహిళా పోలీసుస్టేషన్ సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, పాత బస్టాండు, ఏడురోడ్లు, పాత రిమ్స్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డిసర్కిల్, కాగితాలపెంట, ఐటీఐ సర్కిల్, సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, వాజ్‌పేయి సర్కిల్, రాజీవ్‌పార్కు రోడ్డు, యోగి వేమన సర్కిల్, పూల అంగళ్ల సర్కిల్ మీదుగా హౌసింగ్‌బోర్డులోని శ్రీ కోదండ రామాలయానికి చేరడంతో పూర్తవుతుందన్నారు. మరుసటిరోజు ఉదయం 9 గంటల వరకు ఈ యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ మహాశోభాయాత్రలో భజన బృందాలు, కోలాట కోలాహలం, భజరంగి విన్యాసాలు, కేరళ వాయిద్యాల కేరింతలు, పిల్లన గ్రోవి పిలుపులు, తప్పెట దరువుల తందనాలు, రాజస్తాన్ యువతుల డప్ప దరువులు ఇలా మొత్తంగా 40 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యంతో పాటు అన్నప్రసాద కార్యక్రమం శోభయాత్ర వెంట అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
కడప సెవెన్‌రోడ్స్ : ఈనెల 21వ తేదీ నిర్వహించనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, 22న జరగనున్న శ్రీ రామ మహాశోభయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తూ అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నగరంలో పెద్ద ఎత్తున మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా నినాదాలు చేస్తూ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ కొనసాగే మార్గాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చిన్నచౌకులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా హౌసింగ్‌బోర్డు కోదండ రామాలయానికి చేరుకోవడంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో అయోధ్య ఐక్యవేదిక నాయకులు దేసు వెంకటరెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, సిటీ కేబుల్ సూరి, వీహెచ్‌పీ నాయకుడు లక్ష్మినారాయణరెడ్డి, సంజీవరెడ్డి, జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్‌భట్టర్, భారవి, మణిభూషణ్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, శ్రీరామ సేవకులు పాల్గొన్నారు.


