బాలింత మృతిపై జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన
మదనపల్లె రూరల్ : బాలింత మృతిపై కుటుంబ సభ్యులు మాలమహానాడు నాయకులతో కలిసి గురువారం రాత్రి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం కరసనపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన భాస్కర్ భార్య గగనశ్రీ(23) మొదటి కాన్పు కోసం ఈనెల 24న మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేరింది. కాన్పు కష్టం కావడంతో 25న స్థానిక గైనకాలజీ వైద్యులు శస్త్రచికిత్స చేసి మగబిడ్డను బయటకు తీశారు. ప్రసవానంతర చికిత్స కోసం ఆస్పత్రి మెటర్నటీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. వారంరోజులపాటు చికిత్స పొందిన అనంతరం గురువారం గగనశ్రీని డిశ్చార్జి చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అందులో భాగంగా ఆమెకు కుట్లు తొలగించి డిశ్చార్జి సమ్మరీ తయారుచేసేలోపు గగనశ్రీ పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి వెళ్లింది. దీంతో వైద్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో బాధితురాలిని ప్రైవేట్ అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తిరుపతికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భాకరాపేట వద్ద గగనశ్రీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి అంబులెన్స్‌లోనే మృతి చెందింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆస్పత్రి అత్యవసర విభాగ సిబ్బంది మృతదేహాన్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు వారంరోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న గగనశ్రీ కుట్లుతీసిన వెంటనే ఎందుకు అనారోగ్యానికి గురైందన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే గగనశ్రీ మృతికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాలమహానాడు జాతీయ నాయకులు యమలా సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ తదితరులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా ఆస్పత్రి వద్ద ఆందోళన చేసి నిరసన తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గగనశ్రీ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీ గదికి తరలించారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విషయమై జిల్లా ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ గగనశ్రీకి కుట్లువిప్పే సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశామన్నారు.
బాలింత మృతిపై జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన


