దేవాలయాల్లో హుండీలే టార్గెట్
గాలివీడు : మండలంలోని దేవాలయాల్లో హుండీల ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా చోరీలకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి మరువకముందే మరో ఘ టన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలోని పేరంపల్లి గ్రామ పరిధి పెడకంటి కొత్తపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పా ల్పడ్డారు. ఆలయంలోని హుండీని బద్దలు కొట్టి అందులో ఉన్న నగదు మొత్తాన్ని అపహరించి పరార య్యారు. అనంతరం బద్దలైన హుండీని ఆలయానికి సమీపంలో ఉన్న పంట పొలంలో పడేసి వెళ్లినట్లు గ్రా మస్తులు గుర్తించారు. భక్తులు కానుకల రూపంలో వేసి న నగదు మొత్తం రూ.10 వేలకుపైగా ఉంటుందని ఆ లయ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి నూలివీడు పంచాయతీ పరిధిలోని బొడిసానివారిపల్లెలో ఉన్న రామాలయంలోనూ ఇదే తరహా చోరీ జరిగింది. రామాలయంలోని హుండీని బద్దలు కొట్టి నగదును దోచుకెళ్లిన ఘటన మరువకముందే, మరుసటి రోజే మరో ఆలయంలో చోరీ జరగడం గ్రామ ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాల్లో హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయి ఉంటాయన్న అంచనాలతోనే ఈ చోరీలు జరిగి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దేవాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.
వరుస చోరీలతో హడలెత్తిస్తున్న దొంగలు


