విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పుల్లంపేట : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఏ.పుత్తనవారిపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన పుత్తన వెంకటరెడ్డి(42) విద్యుత్ శాఖలో ప్రైవేటుగా పనిచేస్తూ లైన్‌మెన్‌కు సహకరించేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్ స్తంభం ఎక్కేందుకు సబ్‌స్టేషన్ సిబ్బందిని ఎల్‌సీ కోరాడు. ఇప్పటికే ఎల్‌సీ ఇచ్చి ఉన్నామని సబ్‌స్టేషన్ సిబ్బంది తెలపడంతో మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. ముందుగా ఎల్‌సీ తీసుకున్న వ్యక్తి ఎల్‌సీ తొలగించమని చెప్పడంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ స్తంభంపై వున్న వెంకటరెడ్డి షాక్‌కు గురై కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటరెడ్డి కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.


