సినీ ఫక్కీలో దోపిడీ
మహిళలను నిర్బంధించి ఎనిమిది తులాల
బంగారు, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని బాలుర వసతి గృహానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లో మహిళలను నిర్బంధించి బంగారు, నగదును గురువారం తెల్లవారుజామున దొంగలు దోచుకెళ్లారు. బాధితుల కథనం మేరకు.. సానుగారి ఇంద్రమ్మ, వనజమ్మ అనే ఇద్దరు మహిళలు తమ ఇంట్లో గేటుకు తాళం వేసి నిద్ర పోయారు. దాదాపు రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు గోడదూకి తాళం తీసి ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళల గుండైపె కూర్చొని తాడుతో కట్టేశారు. వారి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. బీరువా పగులకొట్టి రూ. 35 వేలు నగదు, దాదాపు ఎనిమిది తులాలకుపైగానే బంగారు దోచుకెళ్లారు. భయాందోళనకు గురైన మహిళలు తేరుకొని కట్లు విప్పుకొని బంధువులకు ఫోన్ చేశారు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం రైల్వేకోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ పి.మహేష్ దొంగతనం జరిగిన ఇంటిని సిబ్బందితో పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించారు. వీలైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు.


