నీట్ పీజీలో ప్రతిభ చాటిన కరిష్మా
వేంపల్లె : చక్రాయపేట మండలం ఉప్పలవాండ్లపల్లె గ్రామానికి చెందిన షఫీ, పర్వీన్‌ల ప్రథమ కుమార్తె కరిష్మా నీట్ పీజీలో ప్రతిభ చాటింది. ఆమె ప్రాథమిక, ఉన్నత విద్యను వేంపల్లెలోని ఉర్దూ గురుకులంలో చదివి, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2025 పీజీ నీట్ పోటీ పరీక్షలో ఆల్ ఇండియాలో 13 వేలు, రాష్ట్రంలో 732 ర్యాంక్ సాధించి విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఓబీజీ(గైనకాలజిస్ట్) సీటు సాధించింది. తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేదలకు వైద్య సేవలను అందిస్తానని పేర్కొంది.
చౌక దుకాణాల ద్వారా గోధుమపిండి
కడప సెవెన్‌రోడ్స్ : జనవరి నుంచి కడప నగరంలోని 133 ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు కిలో రూ.20 చొప్పున గోధుమపిండి పంపిణీ చేస్తామని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. చక్కి గోధుమ పిండిలో పోషక విలువలు అధికంగా ఉన్నందున కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా బియ్యం లేదా బియ్యానికి బదులు మూడు కిలోల వరకు రాగులుగానీ, జొన్నలుగానీ ఉచితంగా పొందవచ్చని సూచించారు. తెల్లబియ్యం కార్డుకు రూ. 17తో అరకిలో చక్కెర, అంత్యోదయ అన్నయోజన కార్డుకు రూ. 13.50తో కిలో చక్కెర, పొందవచ్చన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కాశినాయన : మండలంలోని నరసన్నపల్లె గ్రామానికి చెందిన కనగాని రమణ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ యోగేంద్ర తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రమణ మద్యానికి బానిస అయ్యాడని, గత నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్లలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ దగ్గర మృతదేహం ఉన్నట్లు బుధవారం స్థానికులు గుర్తించారని తెలిపారు. మృతదేహం సమీపంలో విషద్రావణం డబ్బా గుర్తించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య రామసుధతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వివాహిత ఆత్మహత్య
గుర్రంకొండ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సంగసముద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఎస్. చాంద్‌బాషా, ఎస్.ముబీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన ముబీనా(40) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ముబీనా మృతి చెందింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు.
నీట్ పీజీలో ప్రతిభ చాటిన కరిష్మా


