ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కడప సెవెన్‌రోడ్స్ : పారిశ్రామికంగా విస్తృతమైన వనరులు, ఉపాధి అవకాశాలున్న కడప జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి పరిశ్రమల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం చాంద్ బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
దళితులకు ఎక్కడా అన్యాయం జరగరాదు
దళితులకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడడమే కాకుండా జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తోపాటు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు.. బాల్య వివాహాలను అరికట్టే చర్యల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే, కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు డివిజన్ల ఆర్‌డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, చంద్రమోహన్, డీఎస్పీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి,, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లేబర్ సెస్సు వసూలు చేయాలి
2025 జనవరి నుంచి నవంబరు 25 వరకు పెండింగ్‌లో ఉన్న లేబర్ సెస్సు వసూలు చేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలస్యం లేకుండా ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు విధిగా సెస్సు వసూలు చేయాలన్నారు. కార్మికశాఖ ఉప కమిషనర్ రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


