బాకీ చెల్లించమన్నందుకు దాడి
పులివెందుల రూరల్ : అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరు వ్యక్తులపై మరో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన బుధవారం పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులో గల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలాఉన్నాయి. పులివెందుల పట్టణం పార్నపల్లె రోడ్డులో మెకానిక్ షాపు నడుపుకుంటున్న రాజా వద్ద నుంచి భాస్కర్ అనే వ్యక్తి ఏడాది క్రితం రు.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అలాగే పులివెందులకు చెందిన మహేశ్వరరెడ్డి నుంచి ఏడాది క్రితమే నాగరాజు రు.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత వారు తప్పించుకు తిరుగుతుండటంతో దిక్కుతోచక బాధితులు పెద్ద మనుషుల సహకారంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద భాస్కర్, నాగరాజు ఉన్నారని సమాచారం రావడంతో రాజా, మహేశ్వరరెడ్డిలు అక్కడికి వెళ్లి డబ్బు అడిగారు. దీంతో మమ్మల్నే డబ్బు అడుగుతారా అంటూ వారు రాజా, మహేశ్వరరెడ్డిలపై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులు పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్‌లో సీఐ సీతారామరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన మెకానిక్ రాజ, మహేశ్వరరెడ్డి
బాకీ చెల్లించమన్నందుకు దాడి


