బుడ్డా వెంగళరెడ్డి చిరస్మరణీయుడు
రాజంపేట రూరల్ : రైతు, సమాజ సేవకుడు, సేవా తత్పరుడు బుడ్డా వెంగళరెడ్డి చిరస్మరణీయుడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కొనియాడారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌లో గల ఆకేపాటి అమరనాథరెడ్డి ఇంగ్లీష్ మీడి యం స్కూల్‌లో బుధవారం బుడ్డా వెంగళరెడ్డి 125వ వర్థంతి వేడుకలను ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వెంగళరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ 1866లో సంభవించిన క్షామ సమయంలో బళ్లారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వేల మంది ప్రజలు వెంగళరెడ్డిని ఆశ్రయించారన్నారు. వారికి కొన్ని రోజుల పాటు ప్రతి రోజు ఆహారం అందించారన్నారు. ఇందుకు మెచ్చి అప్పటి బ్రిటీష్ రాణి విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


