
అన్ని మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ 90 రోజుల్లోనే జిల్లా లోని అన్ని మండలాల్లో అమలులోకి రానున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్‌గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల ప్రణాళిక, డిజైన్ల గురించి కలెక్టర్ జేసీ అదితిసింగ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వారు రూపొందించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణాల డిజైన్లను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. నూతనంగా రూపుదిద్దుకోనున్న స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణాలు అన్ని మండలాల్లో ఒకే డిజైన్ తో ఉండాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే కడప నగరంలో నిర్వహణలో ఉన్న స్మార్ట్ కిచెన్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని మండలాల్లో స్మార్ట్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి 60 రోజుల్లో సివిల్ వర్క్ పూర్తి చేసి, మరో 15 రోజుల్లో అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. సీపీఓ హజరతయ్య, డీఈఓ షంషుద్దీన్, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, హౌసింగ్ పీడీ రాజా రత్నం, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్, ఎస్‌ఎస్‌ఏ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
60 రోజుల్లో నిర్మాణాలు పూర్తి