
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న
వృద్ధురాలిని కాపాడిన యవకుడు
రాజుపాళెం : పాపం.. ఆ అవ్వకు ఎంత కష్టమొచ్చిందో.. ఎవరికీ చెప్పుకునే మార్గం లేదో.. ఏమో.. జీవితంపై విరక్తి చెంది కుందూ నదిలో దూకింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ యువకుడు గమనించి సాహసం చేసి నీళ్లలోకి దూకి ఆమెను రక్షించాడు. వివరాలు ఇలా..
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామానికి చెందిన గుర్రమ్మ (68) రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో దూకేందుకు అటువైపు వెళ్లింది. అయితే ఆ సమయంలో కుమ్మరపల్లె గ్రామానికి చెందిన భజంత్రి వివేకానంద ద్విచక్ర వాహనంలో ఆ దారిలో వెళుతున్నాడు. వృద్ధురాలు నీళ్ల వైపు వెళ్తుండటం గమనించి తన వాహనాన్ని ఆపి ఆమెను అనుసరించాడు. అంతలోనే ఆమె కుందూ నది పాత వంతెన మెట్ల వద్ద నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా భారీగా ప్రవహిస్తున్న నీళ్లలోకి దూకి వృద్ధురాలిని బయటకు తీశాడు. ఎందుకు నదిలో దూకాల్సి వచ్చిందని వివేక్ ఆమెను అడుగగా సమాధానం చెప్పలేక పోయింది. ఈ విషయాన్ని ఎస్‌ఐ వెంకటరమణకు, సచివాలయ ఉద్యోగులకు వివేక్ తెలపడంతో వెంటనే వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్రమ్మ వివరాలను ఎస్‌ఐ అడిగి తెలుసుకొని కుమారులను, బంధువులను పిలిపించారు. చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో కుమారుడు ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, వృద్ధురాలిని కాపాడిన వివేక్‌ను ఎస్‌ఐతో పాటు ఇన్‌చార్జి తహసీల్దార్ మనోహర్‌రెడ్డి, మహిళా పోలీసు షాహిదా, సచివాలయ ఉద్యోగులు, గుర్రమ్మ బంధువులు ప్రశంసించారు.