ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. రాజోలు జలాశయం నిర్మాణానికి రూ.1,300 కోట్లు నిధులు అవసరమని చెప్పారని, దానికే నిధులు లేనప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వద్ద ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు మరమ్మతుల కోసం, అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. వాట్సాప్ పాలన, క్వాంటామ్ వ్యాలీ, పీ–4, ఏఐ... ఇలా హైటెక్ ఆలోచనలు మంచివే అయినా, అమలు తీరు ఎలానో చూడాలన్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. మైదుకూరు నియోజక వర్గంలో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రిలో మందులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మంత్రులు పల్లెల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రజల కనీస అవసరాలను గుర్తించి పనులు చేయకపోతే కూటమి పాలన కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మాజీ మంత్రి
డీఎల్ రవీంద్రారెడ్డి