
ఫిలాటెలి స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్‌దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. బుధవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 –26 విద్యా సంవత్సరానికి ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించారన్నారు. మంచి విద్యా రికార్డు, ఫిలాటెలి అభిరుచి కలిగిన విద్యార్థులకు ఫిలాటెలి క్విజ్, ప్రాజెక్ట్ ఆధారంగా స్కాలర్‌షిప్ ఇస్తారన్నారు. నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు ఇస్తారన్నారు. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 6, 9 తరగతుల మధ్య చదువుతూ ఉండాలన్నారు. పాఠశాలలో ఫిలాటెలీ క్లబ్ సభ్యుడిగా ఉండటం లేదా వ్యక్తిగత ఫిలాటెలి డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఈ ఫిలాటెలి రాత పరీక్ష సెప్టెంబర్ 30న ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16 లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పోస్టాఫీసులో సంప్రదించవచ్చన్నారు.