ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు

Aug 17 2025 6:39 AM | Updated on Aug 17 2025 6:39 AM

ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు

ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు

కడప సెవెన్‌రోడ్స్‌: స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా శుక్రవారం కడప పోలీసు పెరేడ్‌ మైదానంలో కడప ఎమ్మెల్యే ఆర్‌.మాధవిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తదితర అధికారులతో వ్యవహరించిన తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

● స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర వర్గాలకు జిల్లా యంత్రాంగం పోలీసు మైదానం వద్ద తగిన సౌకర్యాలు కల్పించిందన్నారు. పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతున్న సమయంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఒకటిన్నర గంట ఆలస్యంగా అక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ మాత్రమే వేదికపై ఆశీనులు అవుతారన్నారు. ప్రజాప్రతినిధుల కోసం వేదిక పక్కన వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు.. ఆలస్యంగా వచ్చే విషయాన్ని కనీసం ముందస్తుగా తమ వ్యక్తిగత సహాయకుల ద్వారానైనా అధికారులకు తెలియజేయలేదన్నారు. అప్పటికే ఎమ్మెల్యేకు కేటాయించిన సీటులో ఇతరులు కూర్చొన్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే కూర్చొన్న వారిని అక్కడి నుంచి పంపివేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారన్నారు. ఎమ్మెల్యే మాధవీ అక్కడ కూర్చొనేందుకు విముఖత చూపారన్నారు. దీంతో వేదికపై ప్రత్యేకంగా కుర్చీని సమకూర్చి ఆహ్వానించామన్నారు. ముందుగానే వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేయడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ స్వయంగా వెళ్లి వేదికపైకి రావాలంటూ ఆహ్వానించినా ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుషంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సివిల్‌ సర్వీసెస్‌ సాధించి జిల్లా ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌పై ఎమ్మెల్యే అమర్యాదకరంగా ప్రవర్తించడం జిల్లాకే అవమానకరమని వాపోయారు. ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన అనధికార ప్రజాప్రతినిఽధి కూడా జిల్లా రెవెన్యూ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమన్నారు. అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించడం ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదన్నారు. స్వయంగా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి వెళ్లి వేదికపైకి రావాలంటూ ఎమ్మెల్యేను ఆహ్వానించినప్పటికీ ఆమె రాకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకునేందుకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొని ఆస్వాదించే బదులు తనకు కుర్చీ వేయలేదంటూ అధికారులపై రుసరుసలాడటం అత్యంత హేయమని దుయ్యబట్టారు. జిల్లా అధికారులనే ఆమె దురుసుగా మాట్లాడుతోందంటే ఇక కిందిస్థాయి అధికారులపై ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

జాయింట్‌ కలెక్టర్‌పై పరుష పదజాలం ఆక్షేపణీయం

ప్రొటోకాల్‌ ప్రకారమే ఏర్పాట్లు చేశాం

వేదికపైకి ఆహ్వానించినా అమర్యాదకరంగా వ్యవహరించడం తగదు

ఈ సంఘటనపై చర్యలు చేపట్టాలనికలెక్టర్‌కు రెవెన్యూ అధికారుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement