
జాతికి ఆదర్శనీయం సర్దార్ గౌతు లచ్చన్న
కడప సెవెన్‌రోడ్స్: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న జాతికి ఆదర్శనీయమని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్నారు. శనివారం కలెక్టర్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధ్యక్షతన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న చేసిన కృషి రాష్ట్రానికే కాకుండా యావత్ భారతావనికే ఆదర్శమని చెప్పవచ్చన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన త్యాగం, పోరాటస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న తన చిన్న వయస్సులోనే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇతర ప్రధాన పోరాటాలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. తొలుత డీఆర్వో, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు