
అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం
వేంపల్లె : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ అక్షయపాత్ర సంస్థ ద్వారా త్వరలో నాణ్యమైన భోజనాన్ని అందించనున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని రెండు మెస్‌లలో పురుగుల భోజనం పెడుతున్నారని శనివారం రాత్రి విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆదివారం ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీని సందర్శించారు. అలాగే ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా, పరిపాలన అధికారి డాక్టర్ రవికుమార్‌లతోపాటు ఆయా శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్సీ విద్యార్థులకు భోజనం అందించే మెస్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెస్‌ల తనిఖీలో అవినీతితోపాటు అపరిశుభ్రంంగా ఉండడంతో మెస్ నిర్వాహకులపై, అధికారులపై ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. మెస్‌ల వద్దనే సిబ్బంది మూత్ర విసర్జన చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అధికారులు కూడా అప్పడప్పుడు పరిశీలన చేస్తూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అంశం తేలిందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు అవినీతికి పాల్పడుతున్న మెస్ నిర్వాహకుల బిల్లులను ఆపాలని డైరెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆగస్టు చివరి వారం నుండి అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీలలో ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ వెంట గండి దేవస్థానం మాజీ ఛైర్మన్ జీవీ రమణ, డీవీ సుబ్బారెడ్డి, ఎస్పీ జయచంద్రారెడ్డి, ఇడుపులపాయ యూనిట్ ఇన్‌చార్జి పోతిరెడ్డి శివ, కావలి భాను కిరణ్, ట్రిపుల్ ఐటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి హామీ