
ఆటోవాలాకు.. వెన్నుపోటు
● రూ.15వేలు ఊసే ఎత్తని సర్కార్
● ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని వైనం
● ఏకపక్షంగా ఉచిత బస్సు పథకం ప్రకటనపై ఆగ్రహం
● దిక్కుతోచని స్థితిలో
ఆటోవాలాల కుటుంబాలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ భుక్తిని లాగేసుకుంటుందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము రేపటి నుంచి ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఖాయమని, కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బ తింటుంటే ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరుపలేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ వాపోతున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో దాదాపు 50వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని యువత సైతం ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో కార్మికుల నెత్తిన పిడుగు పడినట్లు అయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే తమకు కిరాయిలు ఉండవని ఇప్పటికే ఈ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఆటో నిర్వహణ పెను భారం కానుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
14 నెలలైనా అమలు కాని హామీ...
తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్థిక సాయంతో పాటు సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మ బలికింది. అధికారం చేపట్టి 14 నెలలు అవుతున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇకనైనా అమలు చేస్తామని భరోసాను కల్పించలేదు. సంక్షేమ బోర్డు మాటే ఎత్తడం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలకు రుణాలు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. సీ్త్ర శక్తి పథకం అమలు చేయబోతుండడంతో ఆటో కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో కంతులు చెల్లించలేని పరిస్థితి వస్తుందని ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని వాపోతున్నారు.