
ఆర్టీపీపీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : మండల పరిధిలోని కలమల్ల గ్రామ సమీపంలో ఆర్టీపీపీ వద్ద బ్రిడ్జిపైన గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఫ్లైయాష్ టిప్పర్ ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభాషిణి(35), గాయత్రి(25) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముద్దనూరు మండల పరిధిలోని కోసినేపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఆర్టీపీపీలోని లోకోషెడ్‌లో పని చేస్తుండగా, వెంకటేశు కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ అన్నదమ్ములు. గురువారం వారి బంధువులకు సంబంధించిన వివాహానికి ప్రొద్దుటూరుకు బైక్‌లో బయలుదేరారు. బైక్‌ను వెంకటేష్ నడుపుతుండగా అతని భార్య గాయత్రి, వెంకటరమణయ్య భార్య సుభాషిణి వెనుక కూర్చున్నారు. వీరు ఆర్టీపీపీ నుంచి కలమల్ల మీదుగా బైక్‌లో బ్రిడ్జిపై వెళుతుండగా అధిక లోడుతో వస్తున్న ఫ్లైయాష్ టిప్పర్ వెనుక వైపు నుంచి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వెంకటేష్, గాయత్రి, సుభాషిణి కిందపడ్డారు. టిప్పర్ వేగంగా గాయత్రి, సుభాషిణిలపై దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎంత సేపటికి 108 వాహనం రాకపోవడంతో సంఘటన స్థలానికి వచ్చిన కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తన జీపులో తీవ్ర గాయాలైన వెంకటేష్‌ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రికి ఇద్దరు, సుభాషిణికి ఇద్దరు సంతానం ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పరిశీలించారు.
న్యాయం చేయాలంటూ ధర్నా..
మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు, కార్మికులు బ్రిడ్జిపైనే మృతదేహాలను పెట్టుకుని ధర్నా చేపట్టారు. ఫ్లైయాష్‌ను అధికంగా లోడు చేసుకుంటూ టిప్పర్లు, లారీలు మనుషులను తొక్కించుకుంటూ పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్ల యజమానులేమో బూడిదలో ఆదాయం పొందుతుండగా జనం మాత్రం ఇలా మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గాయపడిన వెంకటేష్
ప్రమాదానికి కారణమైన ఫ్లైయాష్ టిప్పర్
బైక్‌ను ఢీకొన్న ఫ్లైయాష్ టిప్పర్
ఇద్దరు మహిళలు దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి
కన్నీరు మున్నీరుగా విలపించిన బంధువులు

ఆర్టీపీపీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీపీపీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం