
ఆరుతడి పంటల రైతుల్లో అలజడి
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
● ఉరకలెత్తుతున్న కుందూ, పెన్నా నదులు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో గత వారం రోజులకుపైగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో అలజడి నెలకొంది. అల్పపీడనం కారణంగా ఎక్కడపడితే అక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరుతడి పంటల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముందుగా సాగు చేసిన ఆరుతడి పంటలకు కొన్నింటికి మేలు జరిగినా మరి కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరమే. దీంతోపాటు ఆలస్యంగా సాగు చేసిన ఆరుతడి పంటల రైతులకు మాత్రం గుండెల్లో గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఉల్లి, మినుము, జొన్న ఇలాంటి పంటలు సాగు చేసిన రైతులకు మాత్రం ఆందోళన తప్పడం లేదు. కొన్ని చోట్ల ఉల్లి పంట రెండు నెలల దశలో కూడా ఉంది. ఇప్పుడిప్పుడే గడ్డలు ఏర్పడే దశ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షానికి పొలాల్లో వర్షపు నీరు నిలిస్తే ఎర్రగడ్డలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. వేలకు వేలు ఖర్చు పెట్టి సాగుచేసిన పంట మరో నెల రోజుల్లో చేతికొచ్చే సమయంలో ఇలాంటి ఎడతెరిపి లేని వర్షాలతో పంటనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఇలాగే మరో నాలుగు రోజులు కొనసాగితే మాత్రం ఎర్రగడ్డ రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం అధికంగా ఉంది. దీంతోపాటు ఉద్యాన పంటలైన పూల రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పూలు నాణ్యత తగ్గుతున్నాయని రైతన్నలు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పత్తి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితో పంటలకు తెగుళ్ల బెడద పెరుగుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఉధృతంగా
పెన్నా, కుందూ నదులు..
వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెన్నా, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాపాడు మండలం అల్లాడుపల్లె దేవళాల వద్ద కుందూనది, చెన్నూరు, సిద్దవటం వద్ద పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పులివెందులలో అత్యధికంగా...
గురువారం తెల్లవారుజూము నుంచి పులివెందులలో అత్యధికంగా 9.6 ఎంఎం వర్షం కురిసింది. అలాగే వేములలో 9 ఎంఎం, ఖాజీపేటలో 6.8 ఎంఎం, సీకేదిన్నెలో 6.4 ఎంఎం, చక్రాయపేటలో 5.8 ఎంఎం, సింహాద్రిపురంలో 5.6 ఎంఎం, కడప, చెన్నూరులలో 5.2, తొండూరు, పెండ్లిమర్రిలో 4.6, రాజుపాలెం, దువ్వూరు, వల్లూరులలో 4.2, వేముల, మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లిలో 4, కొండాపురంలో 3.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసంది. సిద్దవటంలో 3 మిల్లీమీటర్లు, ప్రొద్దుటూరులో 2.6, బద్వేల్‌లో 2.4, చాపాడు, బి.మఠంలలో 2.2, కలసపాడులో 1.8, గోపవరం, అట్లూరు, ముద్దనూరులలో 1.2 మి.మీ. వర్షం కురిసింది.
పంట సాగు
(హెక్టార్లలో )
మొక్కజొన్న 1772
సజ్జ 710
జొన్న 48
కంది 285
మినుము 1502
వేరుశనగ 983.38
పొద్దుతిరుగుడు 225
ఆముదం 23.2
పత్తి 3524.27

ఆరుతడి పంటల రైతుల్లో అలజడి