కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం
పిఠాపురం పీఠాధిపతి సనాతన ధర్మం ఎక్కడ ?
పులివెందుల : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని మెడికల్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5ఏళ్ల కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు చూపించే భాగంలో శుక్రవారం పులివెందుల నుంచి ఆ కార్యక్రమాలను చూడటం జరిగిందని, గండి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మొదలుపెట్టుకుని ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వమైన సరే విద్య, వైద్య విధానాలపై దృష్టి సారిస్తే రాష్ట్రాభివృద్ధికి మంచి జరుగుతుందనే విషయాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించిందన్నారు. రూ.8,500కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 17మెడికల్ కళాశాలలను స్థాపించాలన్న ఉద్యమంలో ఈ కళాశాలకు రూ.530కోట్ల నిధులను వెచ్చించి నిర్మించారన్నారు. ఎంత పెద్ద కళాశాల, ఇంత మంచి కళాశాలకు 100సీట్లు కేటాయించాలని చెప్పి ఎన్‌ఎంసీ పర్మిషన్ కోసం అప్లయ్ చేసి ఆ టైంలో వంద కాదు, 50సీట్లు అంటే... సరే 50 సీట్లతో కళాశాలను రన్ చేయాలనే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తర్వాత మాకు 50సీట్లు కూడా వద్దు మేం ఇచ్చే సీట్లు కూడా ఇవ్వం, మొత్తం సీట్లను వెనక్కి తీసేసుకోండని చెప్పిన పరిస్థితి ఉందన్నారు. ఈ కళాశాల రన్ అయ్యి ఉంటే కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎంతో మేలు జరిగి ఉండేదన్నారు. ఎంతో మంది డాక్టర్లు బయటకు వచ్చేవారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాకు ఉద్యోగాలు ఇచ్చారని, అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో నుంచి మమ్ములను తరిమేసినట్లుందని, ప్రైవేటీకరణ చేస్తారన్న భయంగా ఉందని సిబ్బంది తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని మంచి పనులు ప్రజలకు తెలియాలనే లక్ష్యంతో పులివెందుల నుంచి ప్రయాణం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష
చక్రాయపేట : రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్లు ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు.శుక్రవారం ఆమె చక్రాయపేట మండలంలో అర్ధాంతరంగా ఆగిన కాలేటివాగు ప్రాజక్టును పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. మండలంలోని అన్ని ఎకరాలకు సాగునీటిని అందించి రామాపురం,లక్కిరెడ్డిపల్లె, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె తోపాటు కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రు.5,300 కోట్లతో 0.25 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న కాలేటివాగు ప్రాజక్టును 1.2టీఎంసీలకు పెంచి నిధులు మంజూరు చేశారని చెప్పారు.ప్రాజక్టు పనులు సుమారు 90శాతం పూర్తయ్యాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు కూడా 80 శాతం మందికి పరిహారం అందించినట్లు చెప్పారు.మిగిలిన రైతులకు పరిహారం ఇచ్చి ఆగినపనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయక వదిలేసిందంటే కక్ష సాధింపు కాక మరేమవుతుందని ప్రశ్నించారు. రైతులు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వారైనందునే ఈప్రాజక్టు గురించి పట్టించుకోలేదని అర్థమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందుకు తెస్తాం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల
వైఎస్సార్ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయం కుంభాభిషేకంలో జరుగుతున్న జాప్యంపై సనాతన ధర్మం అని చెప్పే పిఠాపురం పీఠాదిపతి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదప లేదని ఆమె ప్రశ్నించారు. కాలేటివాగు ప్రాజక్టు పరిశీలించిన అనంతరం ఆమె గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు.అనంతరం గత ప్రభుత్వ హయాంలో సుమారు రు.25 కోట్లతో పనులు ప్రారంభించి సుమారు 90 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. ఆలయం కుంభాభిషేకం చేసి భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు జాప్యం చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. తక్షణం కుంభాభి షేకం జరిపించి శ్రావణ మాసంలో వచ్చే లక్షలాది మంది భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. జగనన్న హయాంలో హిందూ ఆలయాలకు పెద్ద పీట వేశారని ఆమె చెప్పారు.కార్యక్రమంలో మండల కన్వీనర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి,జడ్పీటీసీ శివప్రాదరెడ్డి,సతీష్ రెడ్డి తనయుడు రోహాన్ నాగిరెడ్డి,జిల్లా కార్యదర్శి ఈశ్వరరెడ్డి,పార్టీనేతలు వెంకటసుబ్బయ్య, శంకర్‌రెడ్డి, కృష్ణా రెడ్డి,సుబ్బిరెడ్డి,సుధాకర్,ప్రతాప్,గండి చేర్మెన్ కావలి కృష్ణతేజ,శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం


