ప్రభుత్వ భూమి కబ్జా.!
సిద్దవటం : మండలంలోని పెద్దపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో మాధవరం–1 గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిని స్థానికులతో కలిసి కొందరు ఆక్రమించే పనులు చేపట్టారు.
దాదాపు 40 ఎకరాలకు పైబడిన భూమిపై మొక్కలు తొలగించి చదును చేశారు. మాధవరంలోని 937 సర్వే నంబరులో దాదాపు 154 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మాధవరం–1లోని ఎస్‌కెఆర్ నగర్ దళితులు నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మా భూములు మాకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సోమశిల వెనుక జలాల గ్రామాలు ముంపునకు గురై ఇక్కడికి గతంలో మాధవరం–1లోని ఎస్‌ఎఆర్ నగర్ దళితులు వలస వచ్చారు. జీవనాధారం కోసం ప్రభుత్వ భూములు మంజూరు చేయాలని అధికారులను పలుమార్లు కోరారు. వారికి భూపంపిణీ కింద పట్టాలు మంజూరు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అయితే నేటికీ వారికి పట్టాలు మంజూరు చేయలేదు. తరచూ ఈ భూమి ఆక్రమణ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తుండటంతో సర్వే చేసి తమకు భూమి పట్టాలు ఇవ్వాలని పలుమార్లు దళితులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమిని కొందరు పొక్లెయిన్ యంత్రం తెచ్చి భూమిలో చదును పనులు చేపట్టారు. ఈ భూమిపై తమకు ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల పైబడి పట్టాలు ఉన్నాయంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. భూకబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్లీ వారు రాత్రి వేళ పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ భూముల పక్కన నేషనల్ గ్రీన్ హైవే రహదారి నిర్మాణం కోసం పనులు కొనసాగుతుండటంతో అందరి కళ్లు ఈ భూమిపైన పడ్డాయని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమకు భూములు ఇచ్చేంత వరకు నిరవధిక రిలే నిరాహారదీక్షలు చేస్తామని చదును చేసిన స్థలంలో వారు ఆందోళన చేస్తున్నారు.
నిరవధిక రిలే నిరాహార దీక్షలు
చేపట్టిన దళితులు
ప్రభుత్వ భూమి కబ్జా.!


