రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ సమీపంలోని బుగ్గవంక బ్రిడ్జి వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని గుర్తించిన వారు కడప రైల్వే సీఐ 94406 27398, ఎస్‌ఐ 94409 00811 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
గుండె పోటుతో వైద్యుడు శశికాంత్ మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు సి.శశికాంత్ (52) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. శశికాంత్ తండ్రి ప్రముఖ వైద్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ రంగసింహ ఈనెల ఒకటో తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తండ్రి మృతి చెందిన 25 రోజులకే కుమారుడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.
కరెంట్ షాక్‌తో బాలికకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : ఇంటిమిద్దైపె ఆడుకుంటుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి చదువుతున్న బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్‌కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద, శ్రావణి దంపతుల కుమార్తె రెడ్డిప్రసన్న(10) స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో అదే వీధిలోని నిర్మలమ్మ ఇంటి మిద్దైపె తోటిపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, మిద్దైపె తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు విద్యార్థినికి తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సమస్యలతో
వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు...అప్పులు...అనారోగ్యం వెరసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగుచూసింది. కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన రామస్వామి, శివమ్మ దంపతుల కుమారుడు హరినాథ్(32)కు తంబళ్లపల్లె మండలం మూలపల్లెకు చెందిన గంగాదేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవించేవారు. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వచ్చిన హరినాథ్ తల్లిదండ్రులతో పాటు ఇంట్లోనే ఉండేవాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఆరోగ్యం మెరుగుపడలేదు. అంతేకాకుండా చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సమస్యలు, భార్య లేక ఒంటరితనం తదితర కారణాలతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోపుగా హరినాథ్ భార్య గంగాదేవి తన భర్త మృతి చెందడంపై తనకు అనుమానం ఉందంటూ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


