కరుణామయుడు ఉదయించాడు
కడప సెవెన్‌రోడ్స్: ప్రపంచ మానవాళిని రక్షించేందుకే దేవుడు తన ప్రియ పుత్రుడైన ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి బిషప్ ఐజాక్ వరప్రసాద్ అన్నారు. గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని సీఎస్‌ఐ సెంట్రల్ చర్చిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రధాన ప్రసంగం చేశారు. సంవత్సరకాలం నుంచి ఎదురు చూసిన శుభ తరుణం క్రిస్మస్ రూపంలో వచ్చిందని లోకమంతా ఆనందోత్సాహాలతో పర్వదినంగా నిర్వహించుకుంటున్నదని తెలిపారు. క్రీస్తును హృదయాలలో నింపుకునే అపూర్వ అవకాశం ఈ పండుగ ద్వారా లభిస్తోందన్నారు. మన సంతోషాన్ని ఇరుగుపొరుగులతో పంచుకున్నప్పుడే నిజమైన హ్యాపీ క్రిస్మస్ అని ఆయన అభివర్ణించాడు. హృదయశుద్దిగల వారినే ప్రభువు ప్రేమిస్తాడన్నారు. క్రీస్తు అందరికీ ప్రభువని, అందరినీ సమానంగా ఆదరించే మహానీయుడన్నారు. మంచి చేసే వారిని ప్రోత్సహించి మనవంతుగా సహాయం చేయాలని క్రీస్తు ప్రభువు మానవాళికి సందేశమిచ్చాడన్నారు. కార్యక్రమంలో సహాయ గురువులు వాక్య పరిచర్య నిర్వహించారు. చర్చి కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు కడప నగరం రైల్వేస్టేషన్ వద్దగల ఆరోగ్యమాత చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్యమాత విచారణ డైరెక్టర్ ఆధ్వర్యంలో దివ్య బలిపూజ నిర్వహించారు.
బిషప్ ఐజాక్ వరప్రసాద్
ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
కరుణామయుడు ఉదయించాడు


