హత్య చేసి.. రైలు పట్టాలపై పడేసి..
● అదృశ్యమైన వ్యక్తి హత్య
● వివాహేతర సంబంధమే కారణమా..
● ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచనతో
స్పందించిన జిల్లా ఎస్పీ
తొండూరు/ముద్దనూరు : మండల కేంద్రమైన తొండూరు దళితవాడకు చెందిన పైడిపల్లె కిశోర్ (34) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఏడాది జులై 20వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన పైడిపల్లె కిశోర్‌ను కొంతమంది వ్యక్తులు హత్య చేసినట్లు తెలిసింది. గ్రామంలోని వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో ఆమె భర్త, బంధువులు పలుమార్లు కిశోర్‌ను మందలించినా కూడా మార్పు రాకపోవడంతో ఆమె భర్త కొంతమంది కిరాయి వ్యక్తులను ఆశ్రయించి కొంత మొత్తాన్ని సుపారీగా ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడైంది. పైడిపల్లె కిశోర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కిశోర్ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కనిపించకపోవడంతో కిశోర్ సోదరులు, భార్య ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన తొండూరు పోలీస్ స్టేషన్‌లో రెండు నెలలుగా పైడిపల్లె కిశోర్ కనిపించలేదని ఫిర్యాదు చేశారు. దీంతో తొండూరు ఎస్‌ఐ ఘన మద్దిలేటి కేసు నమోదు చేశారు. అయినప్పటికి పోలీసులు పైడిపల్లె కిశోర్ ఆచూకీ తెలపకపోవడంతో ఏమయ్యారో తెలియక నానా తంటాలు పడ్డారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచనతో
స్పందించిన జిల్లా ఎస్పీ..
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పైడిపల్లె కిశోర్ కుటుంబ సభ్యులు కలిసి కిశోర్ ఆచూకీ తెలియడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈ ఏడాది నవంబర్ 13వ తేదీన ఎంపీకి మొరపెట్టుకున్నారు. దీనికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పందించి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌కు పైడిపల్లె కిశోర్ మిస్సింగ్ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకుని దర్యాప్తు చేయాలని సూచించారు. దీంతో జిల్లా ఎస్పీ అన్ని కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు జరిపించి పైడిపల్లె కిశోర్‌ను హత్య చేసి ముద్దనూరు సమీపంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై శవాన్ని వేసినట్లు గుర్తించారు. అయితే పైడిపల్లె కిశోర్ ఇంటి నుంచి ఈ ఏడాది జులై 20వ తేదీన వెళ్లగా 5 రోజుల తర్వాత అంటే 25వ తేదీన ముద్దనూరు రైల్వేస్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది. అప్పట్లో రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. అయితే ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లా ఎస్పీకి కిశోర్ మిస్సింగ్ కేసు గురించి ప్రత్యేక చొరవ చూపాలని కోరిన వెంటనే ఎస్పీ అన్ని కోణాల్లో విచారణ జరపడంతో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న మృతదేహం పైడిపల్లె కిశోర్‌దేనని తేలింది. దీంతో రైల్వే పోలీసులు కిశోర్ కుటుంబ సభ్యులను పిలిపించి జరిగిన విషయంపై విచారణ చేశారు. అప్పటికే విచారణలో పైడిపల్లె కిశోర్ హత్యకు గురైన రోజు రూ.1000 వేరే అకౌంట్‌లో నుంచి అతని అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించినట్లు తెలిసింది. ఆ డబ్బులను కిశోర్ ఏటీఎం ద్వారా డ్రా చేశారు. డ్రా చేసిన కొంత సమయానికి చెన్నారెడ్డిపల్లె సమీపంలో అండర్ బ్రిడ్జి వద్దకు కిశోర్‌తోపాటు మరికొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించినట్లు రైల్వే పోలీసుల విచారణలో తెలిసింది. దీన్నిబట్టి పథకం ప్రకారమే కిశోర్‌తో వారు మద్యం తాగించి అనంతరం అతన్ని రైల్వే ట్రాక్‌పై పడేసి హత్య చేసినట్లు రైల్వే పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కిశోర్ అకౌంట్‌లోకి రూ.1000 డబ్బులు వేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు హత్య బండారం బయటపడినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం కారణంగా కిశోర్‌ను హత్య చేయించినట్లు తెలిసింది. త్వరలో ఈ కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకుంటామని ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు.


