చదువులు చట్టుబండలు
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఇక చట్టుబండలు కానున్నాయి. రోజుకో పథకం, పర్యవేక్షణల పేరుతో చదువులు అటకెక్కుతున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో పిల్లల హాజరు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, పరీక్షల మూల్యాకనం మార్కులు ఆన్‌లైన్ చేయడం, పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయడం వంటి పనులతో అరగంట విశ్రాంతి లేకుండా అల్లాడి పోతున్న అయ్యవార్లకు తాజాగా ముస్తాబు పేరుతో మరో పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో అయ్యవార్లు దిక్కుతోచని పరిస్థితుల్లో అంతర్గతంగా కుమిలిపోతున్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు.
ముస్తాబుతో ముప్పుతిప్పలు...
అయ్యవార్లకు కొత్త అగచాట్లు వచ్చి పడ్డాయి. గత ప్రభుత్వంలో అయ్యవార్లుకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ రచ్చ చేసిన అప్పటి ప్రతి పక్షం గద్దెకెక్కిన తర్వాత నాడు చెప్పిన మాటలను విస్మరించి బోధనేతర పనులు అప్పగిస్తుండటంపై అయ్యవార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదోతరగతి ప్రణాళిక అమలుకు సంబంధించి ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇతర శాఖల కర్రపెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న పంతుళ్లపై చంద్రబాబు ప్రభుత్వం ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం మోపింది. దీంతో విద్యార్థులను ముస్తాబు చేయలేక చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
జీవో విడుదల ఇలా....
ప్రభుత్వ పాఠశాలల్లో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ముస్తాబు కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జోవొ నంబర్– 43 ఇచ్చింది. తప్పని సరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన. సబ్బు, హ్యాండ్‌వాస్, నెయిల్ కట్టర్ ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణా ఉండేలా చూడాలన్నది ఈ జీవో సారాంశం. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్‌లను ఎంపిక చేయడం రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు పరిశుభ్రంగా వచ్చే వారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం, లేదా దువ్వించడం చేయించాలి. అయితే ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు, యూనియన్లు భగ్గమంటున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా.. లేక ముస్తాబు చేయాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం...
వాస్తవానికి ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యవార్లు ఆసక్తి కనబరచనట్లు తెలుస్తోంది. దీతో కొన్ని బడుల్లో ముస్తాబు కార్నర్లు కనిపించని పరిస్థితి చోటు చేసుకుంది. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రం పరుచుకోవడం వంటివి అవసరమే.. అయితే విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటిని ఉంచడం వల్ల వారు చదువుపై కన్నా వ్యక్తిగత సౌందర్యంపైన శ్రద్ధ చూసే అవకాశాలు లేకపోలేదని పలువురు విద్యావంతులు, మేధావులు అంటున్నారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎలా ఉన్నా ఈ ప్రభావం హైస్కూళ్లపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు, గురువులు ఇవేం ఉత్తర్వులంటూ వాపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
పునరాలోచించాలి
ఒకదాని వెంట ఒకటి బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులకు అప్పగిస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా రకరకాల యాప్‌లతోపాటు ముస్తాబు వంటి బోధనేతర కార్యక్రమాల బాధ్యతలు మోపడంవల్ల బోధన మరుగున పడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాలి. – అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్‌టీఏ, జిల్లా అధ్యక్షుడు
బోధనకు ఆటంకం
చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ముస్తాబు కార్యక్రమం రూపొందించింది. తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఉపాధ్యాయులపై రుద్ది, అవి చేయలేదని వారిని సమాజంలో దోషులుగా చూపెట్టడం బాధాకరం. ముస్తాబుపై ఎక్కువ దృష్టి సారిస్తే బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం యాప్‌ల గొడవ, స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర , ముస్తాబు, రోజు ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కల్పించాలి. – లెక్కల జమాల్ రెడ్డి,
ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. రాష్ట్ర అధ్యక్షులు
ముస్తాబు పేరుతో మరో పథకం
గురువులకు కొత్త అగచాట్లు
పాఠశాలల్లో ముస్తాబు కార్నర్‌లు ఏర్పాటు చేయాలని జీవో విడుదల
ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
చదువులు చట్టుబండలు
చదువులు చట్టుబండలు


