కళ తప్పిన పసిడి పురి
ఒడిదుడుకుల మధ్య బంగారు వ్యాపారం
ఆర్థిక ఇబ్బందుల్లో వ్యాపారులు, కార్మికులు
నగదు చెల్లిస్తేనే బంగారం
ప్రొద్దుటూరు : వ్యాపారంలో ఒడిదుడుకులు కారణంగా పసిడిపురి కళ తప్పింది. అమాంతంగా బంగారం ధరలు పెరగడంతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. శుభకార్యాల కోసం అవసరాలకు మాత్రమే ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. పైగా కొనుగోలుదారులు పూర్తిగా నగదు చెల్లిస్తే కానీ వ్యాపారులు ఆభరణాలను తయారు చేయించి ఇచ్చే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో పసిడి వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్రసిద్ధి గాంచింది. బంగారు ఆభరణాల దుకాణాలతోపాటు వేల మంది స్వర్ణకార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మందికి బులియన్ మార్కెట్ ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,500 నమోదైంది. మార్చి 11న రూ.86వేలు ఉండగా.. ఈనెల 22న ఇదే ధర రూ.లక్షకు దాటింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ.లక్షా 5వేల వరకు ధర పలకగా, ప్రొద్దుటూరులో రూ.లక్షకు చేరుకుంది.
ధరల హెచ్చు తగ్గులతో అటు వ్యాపారులు, ఇటు స్వర్ణ కార్మికులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాలకు సంబంధించి గతంలో బంగారు ఆభరణాల కోసం వచ్చే వారు కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా సొమ్మును ఆభరణాలు తయారు చేశాఖ డబ్బు చెల్లించి తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ధరల ప్రభావం కారణంగా పూర్తి డబ్బు కొనుగోలుదారులు చెల్లిస్తే కానీ ఆభరణాలు తయారు చేయించే పరిస్థితి లేదు. స్వయంగా వ్యాపారులే ఈ విషయాన్ని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ ప్రభావమే పెద్ద కారణం
గత ఏడాది ఎన్నికల ముందు నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. భూముల కొనుగోలు, అమ్మకాలు ఢమాల్ అన్నాయి. తద్వారా మార్కెట్‌లో మనీ రొటేషన్ లేదు. మరో వైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల ప్రభావం బంగారం మార్కెట్‌పై పడింది. అన్ని వ్యాపారాలపైన ఇదే పరిస్థితి ఉందని వ్యాపార నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ ఇంతటి ఇబ్బందులు చూడలేదని వాపోతున్నారు.
కళ తప్పిన పసిడి పురి
కళ తప్పిన పసిడి పురి


