10 నుంచి దేవుని కడపలో తెప్పోత్సవాలు
కడప కల్చరల్: తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి మే 10 నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు మార్లు పుష్కరిణిలో విహరిస్తారన్నారు. 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఐదు మార్లు, 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు మార్లు తెప్పలపై విహరించను న్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు.


