లోక్‌అదాలత్ వాయిదా
కడప అర్బన్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా ‘జాతీయ లోక్ అదాలత్’ షెడ్యూల్ ప్రకారం మే 10న (రెండవ శనివారం) జరగాల్సి ఉండగా.. జూలై 5 (మొదటి శనివారం)వ తేదీకి వాయిదా పడింది. ఈ సమాచారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ఎస్.బాబా ఫక్రుద్దీన్ శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని కక్షిదారులు, వివిధ శాఖల అధికారులు గమనించాలని వారు కోరారు.
నీటి అవసరాలపై
ప్రత్యేక దృష్టి
కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాట్ల సన్నద్ధతపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రెండు నెలలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కడప నగరానికి మైలవరం ప్రాజెక్టు ద్వారా ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద నీటిని నిల్వ చేసి పొదుపుగా వాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. మే నెల నాటికి పులివెందుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసేలా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు, ఏపీఎస్పీడీసీఎల్, ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


