
●శమీ దర్శనం
కడప కల్చరల్: పది రోజుల శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. మనలోని చెడును ప్రక్షాళన చేసుకునేందుకు పెద్దలు ఈ పండుగ ద్వారా ఓ మంచి అవకాశం కల్పిస్తున్నారు. మంచివారే కాదు దుష్టులు కూడా ఆ అమ్మకు బిడ్డలే. అయినా మేం మారం అంటూ మొండికేసే దుష్టశక్తులను కరుణామయమైన ఆ అమ్మచూపులే కత్తులై తునుమాడతాయి. మంచి వారికి నిత్యం విజయాలు అందిస్తాయి. ఇకనైనా మంచిగా మారకపోతే కఠిన దండన తప్పదంటూ ఈ పండుగ హెచ్చరిస్తోంది. మంచి వారికి అడగకపోయినా విజయాలు అందిస్తోంది. కష్టాలు వస్తే కుంగి పోకూడదని, మంచికోసం, మాట కోసం రాజరికాన్ని వదులుకొని పాండవులు అడవుల్లో కష్టాలు అనుభవించినా.. వారి మంచిని గమనించిన అమ్మ పాండవ మధ్యముడైన అర్జునుడిని విజయుడిని చేసింది. అందుకే మనమూ మంచిగా ఉందాం. రోజూ విజయాలను అందుకుందాం.
ఆయుధ పూజ
నవరాత్రి ఉత్సవాలలో చివరిరోజైన విజయదశమి ఎంతో విశిష్టతమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ నిర్వహిస్తారు. అందులోని సామాజిక, నైతిక విషయాలను అటుంచితే.. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించిన రోజని, రాముడు రావణాసురుడిని మట్టుబెట్టిన రోజని, భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించిన రోజు అని పురాణాల్లో ఉండటంతో ఈ రోజుకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లలోనూ ఆయుధపూజ నిర్వహిస్తారు. వాహనాలు శుభ్రం చేసుకుంటారు. కర్మాగారాల్లో తమ ఉపాధికి కారణమైన యంత్రాలను శుభ్ర పరుస్తారు. రైతులు వ్యవసాయ పనిముట్లను శుభ్రపరిచి పసుపు, కుంకుమలు అలంకరించి పూజలు నిర్వహిస్తారు.
విజయసాధన
జమ్మిచెట్టును వైదిక భాషలో అరణి అంటారు. యజ్ఞ యాగాదులు (హోమాల్లో) సహజ పద్ధతులలో అగ్నిని పుట్టించేందుకు ఈ కొయ్యనే ఉపయోగిస్తారు. పాండవులు విరాటుని కొలువులో ఉంటూ శమీ వృక్షంపై తమ ఆయుధాలను దాచారని, ఉత్తర గోగ్రహణం సమయంలోనే విజయదశమి రావడం, అజ్ఞాతవాసం గడువు ముగియడంతో జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకుని యుద్ధం చేసి గెలిచారని మహాభారత కథనం. అందుకే శమీ దర్శనంతో తప్పక విజయం లభిస్తుందని విశ్వసిస్తారు.
నేడు విజయదశమి
శమీ వృక్ష దర్శనానికి ఏర్పాట్లు
అమ్మవారి ఆలయాలు, ఇళ్లలో ఆయుధపూజ
శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని.. ఈ జగమంతా అనేక రూపాల్లో కొలువై ఉన్నారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల వేళ.. కొన్ని అవతారాల్లో దర్శనమిచ్చి అభయమిచ్చారు. ఈ వేడుకలు తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి.. గాయత్రిమాతగా కటాక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని కనులారా దర్శించుకుని తరించారు. – ప్రొద్దుటూరు కల్చరల్
ఈ పండుగ ముగింపు సందర్భంగా శమీ వృక్ష దర్శనం జరుగుతుంది. ప్రతి ఆలయంలోనూ సాయంత్రం 3 గంటల అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకమైన రథాలు, పల్లకీలలో కొలువుదీర్చి అట్టహాసంగా సమీపంలోని శమీ వృక్షం వద్దకు తీసుకు వెళతారు. శమీ వృక్ష (జమ్మి చెట్టు) దర్శనం కూడా విజయదశమి నాటి ముఖ్య సంప్రదాయం. ఆరోజు సాయంత్రం ప్రజలు మంగళ వాయిద్యాలతో ఊరికి వెలుపల ఈశాన్యంలో ఉన్న శమీ వృక్షం వద్దకు వెళ్లి.. వాస్తు, దిక్పాలక, శమీ పత్ర పూజలు చేస్తారు. అనంతరం వేద పండితులు ‘శమీ శమయతె పాపం.. శమీ శతృ వినాశనం..’ అంటూ శ్లోక పఠనం చేస్తుండగా, మిగతా వారు ఉచ్చరిస్తూ శమీ వృక్షం చుట్టూ మూడుసార్లు ప్రదక్షణ చేస్తారు. బంగారంలా విలువైనదిగా భావించి జమ్మి ఆకును (బంగారం) అంటూ ఇచ్చి పుచ్చుకుంటారు. జమ్మి చెట్టు గుడి ఆవరణలో ఉంటే ఆ ఆకును ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఇచ్చి పాదాభివందనం చేస్తారు. ఆరోజున వీలుకాకుంటే మరుసటిరోజు లేదా ఆ మరునాడు బంధుమిత్రులకు కూడా జమ్మి ఆకు ఇచ్చి శుభాభివందనాలు తెలుపుతారు.

●శమీ దర్శనం