వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..! | Sakshi
Sakshi News home page

వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!

Published Thu, Feb 1 2024 1:38 AM

- - Sakshi

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్‌ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్‌ ప్రభుత్వం తీసుకున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కడప కార్పొరేషన్‌ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ప్రైవే ట్‌ లిమిడెట్‌(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్‌, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్‌ ఏర్పాటైంది. 2019లో షెడ్‌ కన్‌స్ట్రక్షన్‌కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్‌ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది.

ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం
పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్‌ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్‌, నీరు, ఇతర అనుమతులకు సింగిల్‌ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి.

దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పేపర్‌ ప్లేట్లు, కప్పులకు డిమాండ్‌ పెరిగింది. స్టీల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది.


పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు

మరోవైపు ప్లాస్టిక్‌ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్‌ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్‌ పేపర్‌ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్‌తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది.

ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ
శ్రీ పావన ఇండస్ట్రీస్‌లో క్రాఫ్ట్‌ పేపర్‌ రోల్స్‌, గమ్‌, ఫిల్మ్‌ తెచ్చి కారగేషన్‌ మిషన్‌లో వాటిని అతికించడం ద్వారా పేపర్‌ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్‌ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు.

అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్‌ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్‌సేల్‌గా రూ.1.50, బహిరంగ మార్కెట్‌లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్‌ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది.

నీడ పట్టున ఉంటూనే సంపాదన 
పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! 


 – భారతి, ప్రొద్దుటూరు 
 

ఉన్న ఊర్లోనే ఉపాధి 
ఈ పరిశ్రమలో నేను మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది.

 – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు 

Advertisement
 
Advertisement