అంబేడ్కర్ భవన్ ప్రైవేటుపరం తగదు
కడప సెవెన్‌రోడ్స్ : పీపీపీ విధానం ముసుగులో కడప నగరంలోని అంబేడ్కర్ భవనాన్ని ప్రైవేటుపరం చేయడం తగదని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. సోమవారం నగర మేయర్ పాకా సురేష్‌కుమార్, ఉప మేయర్ నిత్యానందరెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గతంలో దళిత, బీసీ సంఘాలు చేసిన సుదీర్ఘ పోరాటంతో అంబేడ్కర్ భవనాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఆ భవనానికి మరమ్మతులు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. అలాగే నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రం, పాత మున్సిపల్ ఆఫీసు స్థలం, వైఎస్సార్ ఆడిటోరియంను అభివృద్ది పేరుతో ప్రైవేటుపరం చేయడం సమంజసం కాదన్నారు. మంగళవారం జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని కోరారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్‌వీ ప్రసాద్, వినోద్, లోక్‌సత్తా నాయకుడు దేవరశ్రీకృష్ణ, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, వివిధ సంఘాల నాయకులు జేవీ రమణ, డాక్టర్ శ్రీనివాసులు, దస్తగిరి, షేక్ మహమ్మద్ జాకీర్ హుసేన్, పీవీ రమణ, అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు.


