డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనుల్లో జాప్యంపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనుల్లో జాప్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

Nov 24 2026 2:24 AM | Updated on Nov 24 2026 2:24 AM

సాక్షి, యాదాద్రి: భువనగిరి మున్సిపాలిటీలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అంతర్గత పనులను పూర్తి చేయడంలోజాప్యం చేస్తున్న అధికారులపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆగ్రహం వ్యక్తంచేశారు. భువనగిరిలో నిర్మించిన 444 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో తొలి విడతగా 108 ఇళ్లను మౌలిక వసతులతో లబ్ధిదారులకు అప్పగించారు. మిగిలిన 336 ఇళ్లను వారంలోగా అప్పగిస్తామని గత వారం ప్రజావాణిలో కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అయితే పనుల్లో పురోగతి లేకపోవడంతో లబ్ధిదారులు సోమవారం మరోసారి కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి మిషన్‌ భగీరథ, హౌసింగ్‌ పీడీ, మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. అంతర్గత పనులు, మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలని, లేకుంటే సస్పెండ్‌ చేస్తానని అధికారులను కలెక్టర్‌ తీవ్రంగా హెచ్చరించారు.

గుట్ట మున్సిపల్‌ రెవెన్యూ అధికారిణి సస్పెన్షన్‌

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ రెవెన్యూ అధికారిణి, మేనేజర్‌ పి.సుమితను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని యాదగిరిపల్లిలో సుమారు 4 ఎకరాల భూమిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండానే ఇంటి నంబర్లు కేటాయించిన అంశంపై గత నెల 6వ తేదీన ‘ఇళ్లే లేవు.. నంబర్లు ఇచ్చారు..’ అనే కథనాన్ని సాక్షి దిన పత్రికలో ప్రచురించారు. స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఇటీవల డీపీఓ మున్సిపల్‌ కార్యాలయంలో విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. తప్పుడు రికార్డులను సృష్టించి, విధి నిర్వహణలో వైఫల్యం, పురపాలక ఆదాయ, నియంత్రణ ప్రమాణాలను కాపాడటంలో విఫలమైనందున సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులో కలెక్టర్‌ పేర్కొన్నారు.

మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠాపన

భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో శ్రీ యాదాద్రి అష్టలక్ష్మి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం శ్రీమన్నారాయణ సమేత మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి హాజరై అష్టలక్ష్మి దేవతల ప్రాముఖ్యతను వివరించారు. ఆలయంలో మహాకుంభ స్థాపన, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర హవనం, వాస్తు ఆరాధన, జలాధివాసం, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం కార్యక్రమాలనుజరిపించారు.

బాల్య వివాహాల నిర్మూలనలో ముందుండాలి

యాదగిరిగుట్ట: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించి, జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బొమ్మలరామారం, తుర్కపల్లి మండలం మాధాపూర్‌లోని గ్రేట్‌ కమిషన్‌ మినిస్ట్రీస్‌, ఆదరణ బాలల సంరక్షణ సంస్థలలోవసతులను పరిశీలించారు. అనంతరం మల్కాపూర్‌ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. బాల్య వివాహాలు జరిగితే బాలుర సంక్షేమ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098కు, న్యాయ సహాయం కోసం 15100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సహాయ న్యాయవాది నాగరాజు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

మోత్కూరు: రాష్ట్ర స్థాయి ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ షూటింగ్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లా సత్తా చాటింది. చర్లపల్లి సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో జరిగిన పోటీల్లో బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్లు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. మోత్కూరు సేక్రెడ్‌ హార్ట్‌ హైస్కూల్‌ విద్యార్థులు బి.వర్షిత, టి.పల్లవి, యు.హర్షిత (బాలికలు), జి.చరణ్‌, టి.మణిదీప్‌, బి.అబిజ్ఞాన్‌, ఓ.శివస్వామి (బాలురు) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ తానయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ అమల, జిల్లా షూటింగ్‌ బాల్‌ కార్యదర్శి చాంద్‌పాషా, మేనేజర్‌ భాస్కర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement