మాస్టర్‌ప్లాన్‌తో పారిశ్రామిక ప్రగతికి ఊతం
సాక్షి, యాదాద్రి : జిల్లా అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధి విస్తరణతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు – ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాల వరకు హెచ్‌ఎండీఏ పరిధిని పెంచడంతో, జిల్లాలో తాజాగా 5 మండలాల పరిధిలోని 46 గ్రామాలు చేరాయి.
కొత్తగా చేరిన ప్రాంతాలివే..
ఇప్పటికే జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్ పోచంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామాలతో పాటు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తాజా విస్తరణలో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం వైపు ఉన్న ఐదు మండలాల పరిధిలోని 46 గ్రామాలను కొత్తగా చేర్చారు. వీటిలో తుర్కపల్లి మండలంలోని 22 గ్రామాలు , యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి, సంస్థాన్‌నారాయణపురం మండలంలోని 13, వలిగొండ మండలంలోని ఎనిమిది, రాజాపేట మండలంలోని రెండు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో ఇకపై హెచ్‌ఎండీఏ నిబంధనలు, పరిపాలన కొనసాగనుంది.
క్షేత్రస్థాయిలో అలైన్‌మెంట్ సర్వే
విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిలో రహదారుల నిర్మాణంపై అధికారులు ముమ్మరంగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతిపాదిత రోడ్లు ఏయే గ్రామాల గుండా వెళ్తాయి? మార్గమధ్యలో వాగులు, వంకలు, గుట్టలు ఉన్నాయా? ఎక్కడెక్కడ లింక్ రోడ్లు నిర్మించాలి? ఇందుకోసం భూసేకరణ అవసరమా? లేక పాత అలైన్‌మెంట్‌లో ఏమైనా మార్పులు చేయాలా? అనే కోణాల్లో సర్వే కొనసాగుతోంది. కొత్త రహదారుల నిర్మాణంలో రైతుల భూములకు ఇబ్బంది కలగకుండా, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు, పాత నక్షా బాటలను (పానాదులను) అనుసంధానం చేస్తూ రోడ్లు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
హెచ్‌ఎండీఏ విస్తరణతో రూపురేఖలు మారనున్న జిల్లా
ఫ గతంలో ఐదు మండలాల్లోని 115 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలు చేరిక
ఫ ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లతో రవాణాకు మహర్దశ
ఫ జాతీయ రహదారుల వెంట పారిశ్రామిక కారిడార్లకు ప్రణాళికలు
నూతన మాస్టర్‌ప్లాన్ రూపకల్పనతో జిల్లాలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతికి ఊతం లభించనుంది. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–విజయవాడ, గౌరెల్లి–కొత్తగూడెం, సంగారెడ్డి–కంది జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామీణ మండలాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారులను విస్తరించి, పటిష్టపరచడంతో పాటు మధ్యలో తెగిపోయిన (మిస్సింగ్) లింకులను కలపనున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రతిపాదించిన అర్బన్ సెంటర్లు, అర్బన్ నోడ్స్ అభివృద్ధికి క్షేత్రస్థాయి అధ్యయనం అనంతరం తుది మాస్టర్‌ప్లాన్‌ను ఖరారు చేయనున్నారు.


