యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో తొలి సారిగా కోటి పుష్పార్చన పూజ నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భవానీ శంకర్ వెల్లడించారు. మంగళవారం యాదగిరి కొండపైన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీలక్ష్మీనరసింహ నామార్చన సహిత కోటి పుష్పార్చన పూజ జరిపించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఆలయ ముఖ మండపంలో, ఏకాదశిని పురస్కరించుకొని 20న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఆలయ ఉత్తర మాడ వీధిలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు..
ఈ నెల 20 సాయంత్రం 6 నుంచి 7.30 వరకు మాడుగుల నాగఫణి శర్మతో ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి 7.30 నుంచి 9 వరకు తేలు విజయచే జానపద భక్తి సంగీతం, 21న సాయంత్రం 6 నుంచి 7.30 వరకు ఆర్‌పీ పట్నాయక్ భక్తి సంగీతం, స్వప్న వ్యాద బృందం సహకారంతో నృత్య కార్యక్రమం, పరంపర సంస్థ దర్శకత్వంలో జరుపనున్నట్లు వివరించారు. 22 సాయంత్రం 6 నుంచి 7.30 వరకు రుద్రాక్ష ఫౌండేషన్ వారిచే ఒడిస్సీ నృత్య ప్రదర్శన, రాత్రి 7 నుంచి 8 వరకు అభినేత్రి బృందంచే తెలంగాణ దేవాలయాల ఇతివృత్తంపై నృత్య ప్రదర్శన, రాత్రి 8నుంచి 9గంటల వరకు కళా క్షేత్ర బృందం పేరిణి వారిచే నృత్య ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో రోజూ 2500 మందికి ఉచిత అన్న ప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్‌శర్మ ఉన్నారు.
ఫ 19, 20 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు
ఫ మీడియా సమావేశంలో ఈఓ భవానీ శంకర్ వెల్లడి


