నామినేటెడ్‌ జోరు! | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ జోరు!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

పీఏసీఎస్‌లు, మార్కెట్‌, ఆత్మ కమిటీల పదవులకు తీవ్ర పోటీ

ఆత్మ కమిటీల నియామకానికి గట్టిపోటీ

భువనగిరి చైర్మన్‌ గిరి ఎవరికో?

ఫ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు

ఫ వలిగొండ మార్కెట్‌ చైర్మన్‌ ఖరారు.. భువనగిరి,

ఆలేరుపై ఉత్కంఠ

సాక్షి, యాదాద్రి: నామినేటెడ్‌ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తుండడం.. రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండడంతో జిల్లాలో పదవులైన మార్కెట్‌ , పీఏసీఎస్‌లు, ఆత్మ కమిటీల్లోనైనా అవకాశాలు దక్కించుకునేందుకు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

మార్కెట్‌ చైర్మన్‌ పదవులపై కన్ను

జిల్లాలో భువనగిరి, ఆలేరు, వలిగొండ, చౌటుప్పల్‌, మోత్కూరు మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటిలో చౌటుప్పల్‌, మోత్కూరు కమిటీల పదవీకాలం ఇంకా మిగిలి ఉండగా.. గడువు పూర్తయిన ఆలేరు, భువనగిరి, వలిగొండ చైర్మన్‌ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సీఎం, మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలకు సిఫార్సులు చేయించుకునేందుకు ఆశావహులు యత్నిస్తున్నారు.

ఆలేరు బీజీ జనరల్‌కు రిజర్వ్‌

బీసీ జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయిన ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా రాజాపేట మండలం రఘునాథపురానికి చెందిన సీనియర్‌ నాయకుడు బుడిగే పెంటయ్య, వంగపల్లికి చెందిన కానుగ బాల్‌రాజ్‌ గౌడ్‌, యాదగిరిగుట్టకు చెందిన ఎరుకల హేమేందర్‌ గౌడ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా మరికొందరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైస్‌ చైర్మన్‌ పదవిని ఆలేరుకు చెందిన మైనార్టీ నాయకుడు ఎంఏ ఎజాజ్‌ ఆశిస్తున్నారు.

వలిగొండ చైర్మన్‌ ఖరారు..

వలిగొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పాశం స్వరూప పేరును ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, వలిగొండ మార్కెట్‌ పరిధిలోకి వచ్చే రామన్నపేట నకిరేకల్‌ నియోజకవర్గంలో ఉండడంతో వైస్‌ చైర్మన్‌ పేరును నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించాల్సి ఉంది.పాత కమిటీలో ఉన్న వైస్‌ చైర్మన్‌ సిరిగిరెడ్డి మల్లారెడ్డితో పాటు ఆరుగురు డైరెక్టర్లను రెన్యువల్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ, కొత్తవారు పైరవీలు ముమ్మరం చేశారు.

పెండింగ్‌లో ఆరు పర్సన్‌ ఇన్‌చార్జిలు

జిల్లా వ్యాప్తంగా 21 పీఏసీఎస్‌లకు గాను ఇప్పటికే 15 చోట్ల పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకం పూర్తయింది. మిగిలిన ఆరు స్థానాలకు నేతలు పోటీ పడుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం, గుజ్జ, నకిరేకల్‌లోని రామన్నపేట, తుంగతుర్తి పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు, భువనగిరిలోని అరూర్‌ సింగిల్‌ విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉంది. వలిగొండ మండలం అరూర్‌, అడ్డగూడూరుకు ఎమ్మెల్యేలు పేర్లు సూచించినా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

వ్యవసాయ శాఖ పరిధిలోని ఆత్మ కమిటీల చైర్మన్ల నియామకానికి సైతం గట్టి పోటీ ఉంది. ఇప్పటికే భువనగిరికి ఎలిమినేటి కృష్ణారెడ్డి, యాదగిరిగుట్టకు ఎనగండ్ల సుధాకర్‌లను నామినేట్‌ చేశారు. తాజాగా ఆలేరుకు పిక్క శ్రీనివాస్‌ పేరు ఖరారైంది. డైరెక్టర్ల పేర్లు కొలిక్కి రావాల్సి ఉంది. ఒక్కో ఆత్మ కమిటీలో చైర్మన్‌తో పాటు మరో 20 మంది డైరెక్టర్లు ఉంటారు. ఆలేరు డివిజన్‌ పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 12 మంది డైరెక్టర్లను త్వరలో ఎమ్మెల్యే నియమించనున్నారు.

భువనగిరి మార్కెట్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీ నెలకొంది. ఈసారి ఈ పదవి బీబీనగర్‌ మండల నాయకులకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడు గడ్డం బాల్‌రెడ్డి, గోలి నరేందర్‌రెడ్డితో పాటు భువనగిరికి చెందిన చిక్కు ల వెంకటేశం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం బొమ్మలరామారానికి చెందిన మర్రి భగవంతరెడ్డి పేరుతో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మూడు డైరెక్టర్‌ పోస్టులు కూడా ఆలేరు నియోజకవర్గం నుంచే భర్తీ చేయాల్సి ఉండడంతో.. భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు సమన్వయంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్ల పేర్లను ప్రతిపాదించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement