భూదాన్‌పోచంపల్లి: ఎల్ నినో నేపథ్యంలో పిలాయిపల్లి కాలువ మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ రబీ సీజన్‌లో సాగు నిలిపివేస్తూ శ్రీక్రాప్ హాలిడేశ్రీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో భూదాన్‌పోచంపల్లి మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దున్నకాలు చేపట్టవద్దని రైతులకు, విత్తనాలు అమ్మొద్దని ఫర్టిలైజర్ డీలర్లకు అధికారులు అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే కలెక్టర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
11చోట్ల స్ట్రక్చర్లు
కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం గతంలోనే రూ.56 కోట్లు మంజూరు చేసింది. సాయిపవన్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో ఒప్పందం జరిగి ఏడాదిన్నర దాట డంతో, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం కాలువలో 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుండగా, పనుల అనంతరం సామర్థ్యాన్ని 385 క్యూసెక్కులకు పెంచనున్నారు. కనుముకుల, దోతిగూడెం తదితర 11 చోట్ల స్ట్రక్చర్లు, పలు కల్వర్టులతో పాటు జిబ్లక్‌పల్లి వద్ద అండర్ టన్నెల్ నిర్మించనున్నారు.
25న కాలువ బంద్
ఈనెల 25న కాలువను బంద్ చేయనున్నారు. ఈలోపు దిగువ ఆయకట్టులోని చెరువులు, కుంటలను నింపుతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించి, జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేసి తిరిగి సాగునీరు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పిలాయిపల్లి ఫీడర్ నుంచి పెద్దగూడెం వైపు వెళ్లే మూసీ కాలువ కింద మాత్రం సాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
పిలాయిపల్లి కాలువ ప్రాముఖ్యత
66 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ.. భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల మండలాల్లోని 40 గ్రామాలకు జీవనాడి. దీనిద్వారా 24 చెరువులు, 20 కుంటలు నిండటంతో పాటు సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాలువ ఆధునికీకరణతో ఈ బీడు భూములన్నీ పూర్తిస్థాయిలో సస్యశ్యామలం కానున్నాయి.
25 నుంచి కాలువ బంద్.. ఆందోళనలో రైతులు
ఫ కాలువ మరమ్మతులకు సన్నాహాలు
ఫ రూ.56 కోట్లతో ఆధునికీకరణ పనులు
ఫ జూన్ నెలాఖరుకల్లా పనులు
పూర్తిచేసేలా అధికారుల ప్రణాళిక


