చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రీజినల్ రింగ్‌రోడ్డు భూసేకరణ, పరిహారం ఖరారు వంటి అడ్డంకులు దాటి పంపిణీకి సిద్ధమైన రెవెన్యూ అధికారులకు.. ప్లాట్ల, భూ యజమానుల ఆచూకీ దొరకడంలేదు. ఈ నేపథ్యంలో యజమానుల జాడలేదు శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి అనూహ్య స్పందన వచ్చింది. పట్టణంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి సమీపంలో సర్వేనంబర్ 255లో ఉన్న 38.50 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన యజమానురాలి జాడ లభించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్‌మలక్‌పేటలోగల తిరుమలహిల్స్‌లో నివాసం ఉండే చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన గూడూరు రేణుకు, భర్త యాదిరెడ్డిదిగా తేలింది. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని సోషల్‌మీడియాపై అవగాహన కలిగిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో తమ సెల్‌ఫోన్లలో స్టేటస్‌లు పెట్టుకున్నారు. అదే విధంగా ఫేస్‌బుక్‌లోనూ ప్రచారం చేశారు. పత్రిక చదివిన వ్యక్తులు సైతం ఆరా తీశారు. ఆ క్రమంలో పెద్దకొండూరుకు చెందిన పలువురు ఈ విషయాన్ని గుర్తించారు. గూడూరు రేణుక తమ గ్రామానికి చెందిన వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఆర్‌ఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఫోన్‌నంబర్ కూడా ఇచ్చారు. దాంతో ఆర్‌ఐ.. గూడూరు రేణుకు కుమారుడు విజయ్‌రెడ్డితో మాట్లాడారు. వెంటనే విజయ్‌రెడ్డి తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్, ఆధార్‌కార్డు ఆర్‌ఐకి పంపించారు. కాగా రేణుక వివరాలు తెలుసుకునేందుకు తాము రెండు నెలలుగా ఎంతగానో ప్రయత్నించామని, సాక్షి కథనం ద్వారా సులువుగా తమ పని పూర్తయ్యిందని ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. పరిహారం సొమ్మును బాధిత రైతు ఖాతాలో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఫ చౌటుప్పల్‌లోని 38.50 గుంటల భూమి యజమాని
పెద్దకొండూరుకు చెందిన రేణక
ఫ ఓల్డ్‌మలక్‌పేటలోగల
తిరుమలహిల్స్‌లో నివాసం
ఫ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు అకౌంట్ పత్రాలు ఇచ్చిన బాధితురాలి కుటుంబం
ఫ రెండు నెలల ప్రయత్నాలకు సాక్షి కథనం ఫలితం చూపిందన్న రెవెన్యూ అధికారులు


