త్వరలో ఫుట్‌బాల్‌ బాలికల ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఫుట్‌బాల్‌ బాలికల ఎంపిక పోటీలు

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

నల్లగొండ టూటౌన్‌ : ఫిబ్రవరిలో 2027 నిర్వహించనున్న జాతీయ మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు సంబంధించి అర్హులైన క్రీడాకారిణుల ఎంపిక పోటీలను త్వరలో నల్లగొండలో నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రఫత్‌ అలీ, జనరల్‌ సెక్రెటరీ పి.ఫల్గుణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడినట్లు వారు పేర్కొన్నారు.

ప్రీ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపిక

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాలకు చెందిన బీఏ చివరి సంవత్సరం చదువుతున్న ఎన్‌సీసీ కేడెట్‌ కె.ధనుష్‌ ఢిల్లీలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఎన్‌సీసీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ, కనబరిచినందుకు ధనుష్‌ను ఈ క్యాంప్‌కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ధనుష్‌ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.ఉపేందర్‌, ఏఎన్‌ఓ సీహెచ్‌.సుధాకర్‌ అభినందించారు.

‘ఉపాధి’ పనికి వెళ్లి

వృద్ధురాలి మృతి

రామగిరి(నల్లగొండ) : ఉపాధి హామీ (వీబీజీ రాంజీ) పనులకు వెళ్లిన వృద్ధురాలు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. దోమలపల్లి గ్రామానికి చెందిన అల్లోజు అంతమ్మ (65) రోజూలాగే మంగళవారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమె ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయింది. గమనించిన తోటి కూలీలు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

ఆలయ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. స్థానిక భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన భక్తులు మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్‌ రోడ్డు నుంచి కొండ కిందకు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

నల్లగొండ టూటౌన్‌ : బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తల్లి నాగం శ్రీదేవిపై దాడి జరిగినట్లు అందిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఇద్దరు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ మహిళా కమిషన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 31న నల్లగొండలోని నాగం శ్రీదేవి నివాసంలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి, ఆమెతో పాటు ఆమె సోదరుడిపై దాడి చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆస్తులను ధ్వంసం చేయడం, కీలకమైన డిజిటల్‌ సాక్ష్యాలను అపహరించడం, కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఈ ఆరోపణల్లోని వాస్తవాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు నివేదితా సుబ్రమణియన్‌, సీనియర్‌ కోఆర్డినేటర్‌ కంచన్‌ ఖట్టర్‌ ఉన్నారు.

గుర్తుతెలియని

మృతదేహం లభ్యం

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న సూర్యాపేట వన్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే ఇప్పటివరకు మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఏదైనా సమాచారం ఉన్నవారు 8712686005, 8712577224 నంబర్లకు తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement